పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తుల భయాందోళన.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
రాయపోల్ - తిమ్మక్ పల్లి గ్రామాల మధ్య ఉన్న గల్వని చెరువు ప్రాంతంలో

దిశ,దౌల్తాబాద్ : రాయపోల్ - తిమ్మక్ పల్లి గ్రామాల మధ్య ఉన్న గల్వని చెరువు ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న రాయపోల్ ఎస్సై విక్కుర్తి రఘుపతి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి రెండు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపోల్ - తిమ్మక్ పల్లి గ్రామాల మధ్య ఉన్న గల్వని చెరువు ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు చెరువు పక్కన వ్యవసాయ పొలాలు ఉన్న రైతులు తెలిపారు. చిరుత పులి ఎప్పుడు ఒకే చోట నివాసం ఉండదని తరచూ తిరుగుతుంటుందని తెలిపారు. గల్వని చెరువు దగ్గరగా వ్యవసాయ పొలాలు ఉన్న రైతులు గొర్రెలు మేకలు, పశువులను పోలాల వద్ద ఉంచకుండా ఇండ్లలోకి తీసుకొచ్చుకోవాలన్నారు. రాయపోల్ - తిమ్మక్ పల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుత పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ, పోలీస్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. రైతులెవ్వరూ పొలాల చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.