దిశ ఎఫెక్ట్…స్పందించిన కేంద్ర అధికార యంత్రాంగం

పోస్టల్ శాఖ భూమి ఆక్రమణ..ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్రమార్కులు ఖతం చేస్తున్నారు అనే దిశ దినపత్రిక కథనానికి స్పందన వచ్చింది.

Update: 2025-01-09 11:46 GMT

దిశ, సంగారెడ్డి : పోస్టల్ శాఖ భూమి ఆక్రమణ..ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్రమార్కులు ఖతం చేస్తున్నారు అనే దిశ దినపత్రిక కథనానికి స్పందన వచ్చింది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో పోస్టల్ శాఖకు కేటాయించిన భూమిని పక్కనే ఉన్న కాలనీవాసులు అక్రమించారు. మార్చి 2024వ సంవత్సరంలో పోస్టల్ శాఖ భూమి ఆక్రమణకు గురైందని దిశ దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది. సంగారెడ్డిలోని బైపాస్ రోడ్డులో సర్వేనెంబర్ 374 లో రెండెకరాల స్థలాన్ని పోస్టల్ డిపార్ట్మెంట్ కు ప్రభుత్వం కేటాయించింది. కానీ కొందరు ఆక్రమణదారులు ఆ భూమిపై కన్నేశారు. పోస్టల్ డిపార్ట్మెంట్ కు చెందిన అధికారులు వారికి కేటాయించిన రెండెకరాల పై చిలుకు భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. కొందరు ఆ ఫెన్సింగ్ ను తొలగించి అక్రమంగా రాత్రికి రాత్రే రోడ్డు, డ్రైనేజీని నిర్మించి ఆక్రమిస్తున్నారు.అదే విధంగా పోస్టల్ శాఖకు కేటాయించిన రెండు ఎకరాల భూమిలో నుంచి సుమారు మూడు మీటర్ల మేర జాగను ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేశారు. అదే విధంగా మురికి కాలువను సైతం నిర్మించి ఆ స్థలంలోకి ఎవ్వరూ రాకుండా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసుకున్నారు.

దీనిపై దిశ దినపత్రిక వరుస కథనాలు వెలువరించింది. పోస్టల్ శాఖ సెంట్రల్ గవర్నమెంట్ కు చెందినది. దిశలో వచ్చిన కథనాన్ని పరిశీలించిన పోస్టల్ శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి మా స్థలం మాకు వచ్చేలా చూడాలని లేఖ రాశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు చొరవ తీసుకుని పోస్టల్ శాఖకు కేటాయించిన రెండెకరాల స్థలం జిల్లా పోస్టల్ కార్యాలయం నిర్మించుకునేందుకు ఇవ్వాలని, ఆక్రమణలు తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం 374 సర్వే నంబర్ లోని స్థలం పోస్టల్ శాఖకు సర్వే నిర్వహించి అప్పగించాలని, అక్రమంగా వేసిన రోడ్డును తవ్వివేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంగారెడ్డి రెవెన్యూ అధికారులు గురువారం పోస్టల్ శాఖ భూమికి సర్వే నిర్వహించి హద్దులు చూపెట్టారు. ఆక్రమణ జరిగిందని నిర్దారించారు. దీంతో పోస్టల్ శాఖ అధికారులు జేసీబీ సహయంతో అక్రమ రోడ్డును తవ్వివేశారు. పోస్టల్ శాఖ భూమిని కాపాడిన దిశ దినపత్రిక యాజమాన్యానికి, దిశ ప్రతినిధికి ధన్యవాదాలు తెలిపారు.

దిశ దినపత్రికకు ధన్యవాదాలు : పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ ఎల్.వి.మురళీ కుమార్

పోస్టల్ శాఖకు చెందిన రెండెకరాల భూమిలో నుంచి కొంత భాగాన్ని ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేశారని, భూమి ఆక్రమణకు గురైందంటూ వరుస కథనాలు దిశ పత్రిక ప్రచురించడంతోనే మా భూమి మాకు దక్కిందని దిశ ప్రతికకు ధన్యవాదాలు తెలిపారు. పోస్టల్ శాఖ స్థలం చుట్టూ పూర్తి పెన్సింగ్ చేస్తామని, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే భవన నిర్మాణం చేపడతామన్నారు. రెండెకరాల భూమిలో నుంచి ఎవ్వరూ ఆక్రమించిన ఊరుకోబోమని తెలిపారు. తాము స్వయంగా పర్యవేక్షిస్తూ అక్రమ రోడ్డు నిర్మాణాన్ని తవ్వివేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ శాఖ ఉద్యోగులు ఏఎస్పీ రఘువీర్, పోస్టల్ సిబ్బంది శ్రీనివాస్ గౌడ్, విజయ్ కుమార్, నాగరాజు, శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి, ప్రవీన్ కుమార్, కామేష్, మురళీ తదితరులు పర్యవేక్షించారు.


Similar News