పత్తి కొనుగోళ్ళు సాఫీగా జరగాలి.. అదనపు కలెక్టర్

Update: 2023-10-10 14:34 GMT

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లాలో పత్తి కొనుగోళ్ళు సాఫీగా జరగాలని అదనపు కలెక్టర్ మాధురి జిన్నింగ్ మిల్లుల యజమానులను కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో పత్తి కొనుగోళ్లపై ఆయా శాఖలు చేపట్టాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2023-24 సంవత్సరం వానా కాలం జిల్లాలో 3,58,690 ఎకరాలలో రైతులు పత్తి పంట వేశారని, సుమారు 2.51 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిపారు. పత్తి నిల్వకు జిల్లాలో 37 గోడౌన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. బయోమెట్రిక్ డాటా బేస్ తోనే సీసీఐ కొనుగోలు చేస్తుందన్నారు. రైతు పట్టా పాస్ బుక్‌తో ఆధార్ లింక్ ఉండాలని, బాగా ఆరిన, తేమ శాతం తక్కువగా ఉంటే ఎక్కువ ఎంఎస్‌పీ లభిస్తుందని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

8 శాతం లోపు తేమ గల పత్తికి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.7,020 గా లభిస్తుంది తెలిపారు. ఆయా అధికారులు తమ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. జిన్నింగ్ మిల్లుల యజమానులు పత్తి కొనుగోలు కేంద్రాలలో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని, అలాగే రైతులకు తాగునీరు, టాయిలెట్స్, తదితర కనీస సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి మొహమ్మద్ రియాజ్, వ్యవసాయ శాఖ జెడి నరసింహారావు, ఆర్‌టీఏ, లీగల్ మెట్రాలజీ, అగ్నిమాపక, పోలీస్, సీసీఐ అధికారులు, మార్కెట్ కమిటీ సెక్రటరీలు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News