మహాలక్ష్మి దేవిగా వన దుర్గమ్మ..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వన

Update: 2024-10-07 09:52 GMT

దిశ, పాపన్నపేట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గాదేవి క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో రోజైన సోమవారం పంచమి పురస్కరించుకొని వనదుర్గామాతను మహాలక్ష్మి దేవి రూపంలో, పెసరు రంగు వస్త్రం, కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించారు. ఆలయ అర్చకులు శంకరశర్మ, పార్థివ శర్మ తదితరులు వేకువజామునే రాజగోపురంలో ప్రతిష్టించిన అమ్మవారి ఉత్సవ విగ్రహం, గోకుల్ షెడ్ లో ప్రతిష్టించిన వన దుర్గమ్మ ఉత్సవ విగ్రహాలకు అభిషేకం, అర్చనలు నిర్వహించి పెసరు రంగు వస్త్రం, వివిధ రకాల పుష్పాలు, కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించారు.

అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మ దర్శనం కల్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన మంగళవారం ఏడుపాయల్లో వనదుర్గమ్మకు ఘనంగా బోనాలు సమర్పించనున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్, అర్చకులు తెలిపారు. ఈ బోనాల కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని వారు కోరారు.


Similar News