సీఎం రాకతో కురుమూర్తి సమస్యలు తీరేనా..?

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన జాతరల్లో కురుమూర్తి జాతర ఒకటి.

Update: 2024-11-10 03:33 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో/చిన్న చింతకుంట : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన జాతరల్లో కురుమూర్తి జాతర ఒకటి.. దాదాపుగా నెల రోజులకు పైగా జరిగే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కురుమూర్తి రాయుడిని కొలవడం ఆనవాయితీగా వస్తోంది.. గతంలో జాతర వేడుకల సందర్భంగా తప్ప.. మిగతా రోజులలో ఇక్కడ జనసంచారం అంతంత మాత్రంగానే ఉండేది.. ప్రతి ఏటా జాతర రోజులలోనే కాకుండా సాధారణ రోజులలోనూ స్వామి వారి సందర్శనకు భక్తుల సందడి పెరుగుతోంది. కానీ ఇక్కడ సరైన వసతులు లేకపోవడం, రోడ్డు వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉన్న కారణంగా భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

పనులన్నీ తాత్కాలికమే..

కురుమూర్తి జాతర సందర్భంగా ఏర్పాటు చేసే మరుగుదొడ్లు.. విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు అన్ని తాత్కాలికమే.. జాతర ముగిసిన తర్వాత వాటి జాడే ఉండదు. దీనితో జాతరకు వచ్చే భక్తులు బహిరంగంగానే ఒకటి.. రెండుకు వెళ్లవలసిన పరిస్థితులు ఉన్నాయి. రద్దీ కారణంగా మురుగునీరు సైతం రోడ్లు, దారుల వెంబడి పారుతుండడంతో భక్తులు ఇబ్బందులకు గురికావలసి వస్తోంది. జాతర సందర్భంగా నెలరోజులు భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో. అమావాస్య, పౌర్ణమి, ప్రతి శనివారం రోజున కూడా భక్తుల సందడి పెద్ద ఎత్తున ఉంటుంది. వివాహాలు కూడా ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయి. కానీ సరియైన వసతులు లేక ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు ఉన్నాయి.

సీఎం పై రేవంత్ పై ఆశలు..

కురుమూర్తి జాతర సందర్భంగా నీటి సమస్యలు లేకుండా అధికారులు ఇటీవలే చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఘాట్ రోడ్డు నిర్మాణానికి రూ.110 కోట్లతో ప్రభుత్వం మంజూరు చేసిన నేపథ్యంలో కొండపైకి వృద్ధులు పిల్లలు సులభంగా చేరుకొని తిరిగి రావడానికి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఘాటు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు స్వామి వారి దర్శనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కురుమూర్తిలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయి అన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. పెద్ద ఎత్తున మరుగుదొడ్లు, డ్రైనేజీ కాలువలను నిర్మాణాలను చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు. అక్కడక్కడ అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను మరమ్మతులు చేయడంతో పాటు.. అవసరం మేరకు అదనంగా రోడ్లు వేయించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. వివాహాలు, ఇతర శుభకార్యాలు స్వామివారి సన్నిధిలో ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఆ వేడుకలు జరుపుకోవడానికి వీలుగా కళ్యాణ మండపాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి అవసరమైన చోట్ల విద్యుత్తు స్తంభాలు, లైట్లు ఏర్పాటు చేయాలని పలువురు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

అభివృద్ధి చేస్తే గొప్ప పర్యాటక స్థలం..

ఐదు కొండలతో ఉన్న కురుమూర్తి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందగలదన్న అభిప్రాయాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం.. అభివృద్ధి చెందించడానికి అన్ని అవకాశాలు ఉన్న కారణంగా కురుమూర్తి దేవాలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీల వర్షం గుప్పిస్తారు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Similar News