కరెంట్ కష్టాలు తీర్చండి.. అధికార పార్టీ సర్పంచుల గోస
కరెంట్ కష్టాలతో నిత్యం రైతులు, ప్రజల నుంచి ఇబ్బందులకు గురవుతున్నామంటూ అధికార పార్టీ సర్పంచులు మండల సర్వ సభ్య సమావేశంలో తమ గోస వెళ్లబుచ్చకున్నారు.
దిశ, అమరచింత: కరెంట్ కష్టాలతో నిత్యం రైతులు, ప్రజల నుంచి ఇబ్బందులకు గురవుతున్నామంటూ అధికార పార్టీ సర్పంచులు మండల సర్వ సభ్య సమావేశంలో తమ గోస వెళ్లబుచ్చుకున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో అధికారులు విద్యుత్ సరఫరా చేయడంలో సమయపాలన పాటించడం లేదు. దీంతో గ్రామాల్లో ప్రజలకు నీటికష్టాలు తప్పడం లేదని సమావేశంలో ప్రజా ప్రతినిధులు అధికారులను నిలదీశారు.
వేళా పాల లేని కరెంట్ కోతలతో తాము సైతం ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పక్క ప్రభుత్వం 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తున్నామని చెప్తుంటే.. మరో పక్క ఇలా కరెంట్ కోతలపై అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు తమ గోడును వినిపించుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, జడ్పీటీసీ శివరంజనీ, తహశీల్దార్ సిందూజ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.