విలీనము చేయవద్దు.. గ్రామ పంచాయతీగానే కొనసాగించాలి..
బలిజపల్లి గ్రామపంచాయతీని కొనసాగించాలని, జంగమయ్య పల్లి గ్రామ పంచాయతీలో విలీనం చేయవద్దు అని బలిజపల్లి గ్రామస్తులు రస్తా రోకో చేపట్టారు.
దిశ, వనపర్తి : బలిజపల్లి గ్రామపంచాయతీని కొనసాగించాలని, జంగమయ్య పల్లి గ్రామ పంచాయతీలో విలీనం చేయవద్దు అని బలిజపల్లి గ్రామస్తులు రస్తా రోకో చేపట్టారు. సోమవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం, బలిజపల్లి గ్రామప్రజలు వనపర్తి - ఖిల్లా ఘణపురం వెళ్లే రహదారి పై ధర్నా చేస్తున్నారు. వనపర్తి జిల్లా, పెద్దమందడి మండలం, బలిజపల్లి, జంగమాయపల్లి జంట గ్రామాలను వేరు, వేరు గ్రామ పంచాయతీలుగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా తమ మాటలను వినే పరిస్థితులలో లేరని గత్యంతరం లేక రోడ్డు పై బైఠాయించి నిరసన తెలుపుతున్నామంటున్నారు. రాస్తారోకో చేయడంతో రహదారి పై రెండు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అభివృద్ధి నినాదంతో సాధించుకున్న హక్కును రాజకీయ లబ్ధి కోసం, స్వార్థ రాజకీయాల కోసం కొందరు కుట్ర చేస్తున్నారని, 30 ఏండ్లుగా పోరాటం ఫలితంగా బలిజేపల్లి, జంగమాయపల్లి గ్రామాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని తెలిపారు. కొంత మంది స్వార్థ ప్రయోజనాల కోసం మనస్పర్థలు, విబేధాలు సృష్టించి మళ్ళీ రెండు గ్రామాలను కలిపి ఉమ్మడి గ్రామ పంచాయతీగా చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని విమర్శించారు.