'హోంమంత్రి వ్యాఖ్యానాలు దేశానికే అవమానకరం..'
దేశ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యానాలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితులు మంచి రెడ్డి చెప్పారు.
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : దేశ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యానాలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితులు మంచి రెడ్డి చెప్పారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేద్ ఉల్లా కొత్వాల్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బాధ్యతగల హోదాలో ఉన్న అమిత్ షా రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ పై అవమానకర వ్యాఖ్యానాలు చేయడం భారత జాతికే అవమానకరం అన్నారు. ఈ అంశం పై హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణం క్షమాపణలు చెప్పి, పదవి నుండి తప్పుకోవాలని వంశీ చందు రెడ్డి డిమాండ్ చేశారు. హోం శాఖ మంత్రిని బర్తరఫ్ చేయకుంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం అంబేద్కర్ ను అవమానపరిచారని భావించవలసి ఉంటుందని చెప్పారు.
భారతీయ జనతా పార్టీ పెత్తందారులకు దేశాన్ని కట్టబెట్టాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ న్యాయ సిద్ధాంతాలకు కట్టుబడి.. దేశ సమైక్యతకు కృషి చేస్తుందని వంశీ చంద్ రెడ్డి తెలిపారు. అంబేద్కర్ సిద్ధాంతాలను కాంగ్రెస్ ఉన్నత స్థాయికి తీసుకు వెళుతుంటే.. కేంద్ర పాలకులు మాత్రం అంబేద్కర్ సిద్ధాంతాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రమంత్రి అమిత్ షా రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేద్ పుల్ల కొత్వాల్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ విభజించు పాలించు అన్న సిద్ధాంతం ప్రకారం వ్యవహరిస్తోంది, దీనివల్ల దేశ సమైక్యతకు ముప్పు వస్తుందని చెప్పారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను కేంద్ర మంత్రి అమిత్ షా అవమానించడం దురదృష్టకరం అన్నారు. హోంమంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రిని పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా ఉన్నత అధికారుల ద్వారా రాష్ట్రపతికి ఫిర్యాదులు పంపుతామని చెప్పారు.
క్రిస్మస్ వేడుకలు : ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కొత్వాల్ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు సీజే బెనహర్, తదితరులకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, కాంగ్రెస్ రాష్ట్ర నేతలు ఎన్పీ వెంకటేష్ , జహీర్ అఖ్తర్, తదితరులు పాల్గొన్నారు.