నూతన వ్యవసాయ మార్కెట్ విధానంను వెంటనే ఉపసంహరించుకోవాలి.. ఎస్కేఎం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపశమహరించుకోవాలని సీఐటీయూ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టా ఆంజనేయులు డిమాండ్ చేశారు.
దిశ, వనపర్తి : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపశమహరించుకోవాలని సీఐటీయూ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టా ఆంజనేయులు డిమాండ్ చేశారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుమేరకు సీఐటీయూ, రైతు సంఘం, వ్యాకస, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్, పీఎన్ఎం సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నూతన వ్యవసాయ మార్కెట్ జీవో కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి బాల్ రెడ్డి, వ్యాకాస జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్రంలో మూడోవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మళ్లీ నల్ల వ్యవసాయ చట్టాలను మరో రూపంలో తీసుకువచ్చే కుట్ర చేస్తుందని మండిపడ్డారు.
ఇందులో భాగంగా నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకురావడం ద్వారా కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడేలా ఉందని ఆరోపిస్తూ, నూతన వ్యవసాయ మార్కెట్ విధానంను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, అదేవిధంగా పంజాబ్ సరిహద్దుల్లో రైతుల చేస్తున్న పోరాటాలను అనుచివేసే చర్యలను ఆపాలని, అక్రమ కేసులు పెట్టి గ్రేటర్ నోయడలో జైల్లో ఉంచిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం నాయకుడు జగ్జీత్ సింగ్ దళ్లేవాలే ఆరోగ్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కాపాడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతు సంఘాలతో చర్చలు జరిపి, రైతు సంఘాల డిమాండ్ లను పరిష్కరించాలని కోరారు. సమస్యలను పరిష్కారించకపోతే, ఎస్కేయం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.పరమేశ్వర చారి, డీవైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శివవర్మ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆది, తార సింగ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మదన్, పీఎన్ఎం జిల్లా అధ్యక్షులు నందిమల్ల రాములు, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గట్టన్న, బీసన్న తదితరులు పాల్గొన్నారు.