కొత్త టీచర్లు వచ్చేస్తున్నారు.. నేడు పోస్టింగుల కోసం కౌన్సిలింగ్..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలకు ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చేయనున్నారు.
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలకు ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చేయనున్నారు. గత పది సంవత్సరాలుగా ఉపాధ్యాయ నియామకాలు లేక అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో కొత్త ఉపాధ్యాయుల రాక వ్యవస్థను కొంత మెరుగుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి చేతులమీదుగా నియామక పత్రాలు అందుకున్న కొత్త ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు మండలాల వారీగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేసే పనిలో ఉన్నారు. ఈనెల 15వ తేదీన పోస్టింగులకు సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించి ఈ నెల 16వ తేదీ లోపు ఎంపికైన ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో విధులలో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని విద్యాశాఖ అధికారులు, సిబ్బంది ఆగమేఘాలపై సోమవారం సాయంత్రం ఆయా పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు, వారి సంఖ్యకు అనుగుణంగా ఉన్న ఉపాధ్యాయులు.. ఇంకా ఏమైనా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించాలా..!? లేక ఇతర పాఠశాలలకు కేటాయించాలా అన్న అంశాల పై అధికారులు రాత్రి పొద్దుపోయే వరకు వివరాలు సేకరించారు.
జిల్లాల వారీగా భర్తీ కానున్న పోస్టుల వివరాలు..
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా డీఎస్సీ నియామకాల కోసం అధికారులు 1160కు పైగా పోస్టులను గుర్తించినప్పటికీ పలు కారణాల వల్ల 842 పోస్టులు మాత్రమే భర్తీ కానున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 196, గద్వాలలో 140, నాగర్ కర్నూల్ జిల్లాలో 210, వనపర్తిలో 126, నారాయణపేటలో 200 మంది కొత్త ఉపాధ్యాయులకు సంబంధించిన పోస్టింగులను కేటాయించనున్నారు. ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసిన విషయం పాఠకులకు తెలిసిందే. కొన్ని ఖాళీలకు రిజర్వేషన్లకు సంబంధించిన అభ్యర్థులు లేకపోవడం, ఎస్జీటీ స్పెషల్ కేటగిరి పోస్టుల భర్తీకి సంబంధించి కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ పోస్టుల భర్తీ తాత్కాలికంగా నిలిచిపోయింది. నారాయణపేట జిల్లాలో సాంఘిక శాస్త్రం, తెలుగు సబ్జెక్టులకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులతో ఆ పోస్టుల భర్తీ కూడా ఆగింది.
ఉదయం నుంచి కౌన్సిలింగ్..
ఖాళీల భర్తీకి సంబంధించి కొత్త ఉపాధ్యాయులకు ఆయా జిల్లా కేంద్రాలలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియను కొనసాగించనున్నారు. ముందుగా స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీలు, ఆ తర్వాత ఎస్జీటీలకు సంబంధించి తెలుగు, ఉర్దూ, కన్నడం పోస్టుల భర్తీ జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. అభ్యర్థులు తమ వెంట నియామక పత్రంతో పాటు, మూడు పాస్ ఫొటోలు తెచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
బదిలీ అయిన ఉపాధ్యాయుల రిలీవ్..
బదిలీ అయినా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రిలీవ్ కాకుండా ఉండిపోయిన ఉపాధ్యాయులు మంగళవారం సాయంత్రం వరకు రిలీవ్ అయి వారి వారికి కేటాయించిన పాఠశాలలకు వెళ్లి విధులలో చేరాల్సి ఉంటుంది. ఈ మేరకు సంబంధిత ఉపాధ్యాయులకు ఆదేశాలను జారీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 300, గద్వాలలో 55, నాగర్ కర్నూల్ జిల్లాలో 90, వనపర్తి జిల్లాలో 85, నారాయణపేట జిల్లాలో మంది ఉపాధ్యాయులు రిలీవ్ కానున్నారు.
16 నుంచి విధుల్లోకి కొత్త టీచర్లు..
ఈనెల 16వ తేదీ నుంచి ఆయా పాఠశాలలకు కొత్త టీచర్లు రానున్నారు. మంగళవారం కౌన్సిలింగ్ పూర్తిచేసుకుని వీలైతే అదే రోజు లేదా మరుసటి రోజు వారి వారికి కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు.
స్పెషల్ ఎస్జీటీల స్థానాలు గుర్తింపు..
స్పెషల్ ఎస్జీటీ పోస్టుల భర్తీకి సంబంధించి కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో ఆ పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు తీసుకోలేదు. కానీ ఇతర కేటగిరీల వారికి మంగళవారం పోస్టులు కేటాయించిన ఉండడంతో.. స్పెషల్ ఎస్జీటీ వారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందున. వారికి ఏఏ స్థానాలు కేటాయించాలి. అన్న అంశం పై రాత్రి 11 గంటల సమయంలో రాష్ట్ర అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులకు స్పష్టతను ఇచ్చారు. మరి స్పెషల్ ఎస్జీటీ వారికి కూడా పోస్టింగులు మిగతా వారితో పాటుగా ఇస్తారా.. లేదా అన్న అంశం పై మంగళవారం ఉదయం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.