పాలమూరుకు.. రైతు పండగొచ్చే..!!

ఉమ్మడి పాలమూరు జిల్లాకు రైతు పండుగ వచ్చింది.

Update: 2024-11-28 02:03 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో/భూత్పూర్: ఉమ్మడి పాలమూరు జిల్లాకు రైతు పండుగ వచ్చింది. భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ పండుగను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పండుగ రైతన్నలు మురిసేలా.. వ్యవసాయ రంగం మెరిసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు హామీల వర్షాలు గుప్పిస్తారని ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. వ్యవసాయం మరింత అభివృద్ధి చెంది.. అన్నదాతలు ఆనందంగా ఉంటేనే ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి సాధించినట్లు అవుతుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో.. రైతులు మూడు రోజుల పాటు ఈ వేడుకలను జరుపుకునే అవకాశం దక్కింది. కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజా ప్రతినిధులు.. అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

నేడు వేడుకలు ప్రారంభం..

ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్న రైతు పండగను జయప్రదం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గురువారం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ హాజరవుతున్నారు. 11 గంటల ప్రాంతంలో మంత్రులు సభా స్థలికి చేరుకొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

రైతులకు సూచనలు సలహాలు..

వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చెందించేందుకు అవసరమైన సలహాలు సూచనలను పలువురు శాస్త్రవేత్తలు, నిపుణులు ఇవ్వనున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం రైతులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే 120 కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతులకు కొంత అవగాహన కల్పించడంతో పాటు శాస్త్రవేత్తలు, నిపుణులచే అవగాహన కల్పించడం ద్వారా మరింత ప్రయోజనం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు, ఎమ్మెల్యేలు..

భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ గ్రామ శివారులో రైతు పండగ కోసం భారీ ఏర్పాట్లను రాష్ట్ర, జిల్లా అధికారులతో పాటు, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా పరిశీలించారు. ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, ఐజీ సత్యనారాయణ, కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకి తదితరులు ప్రత్యేకంగా పరిశీలించారు.

భారీగా బందోబస్తు..

రైతు పండగ సందర్భంగా భారీ బందోబస్తు నిర్వహించేందుకు పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన ఐజీ సత్యనారాయణ జిల్లా ఎస్పీ జానకితో కలిసి మీడియాకు పలు వివరాలను వెల్లడించారు. ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు మొత్తం 200 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు.

విస్తృత ప్రచారం..

రైతు పండగకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ ప్రముఖులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చి రైతులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజవంతం చేయాలని సూచిస్తున్నారు.

ముఖ్యమంత్రి రాక కోసం ఎదురుచూపులు...

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలంతా ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యవసాయ రంగా అభివృద్ధి కోసం తీసుకోబోయే చర్యలు తదితర అంశాలపై హామీలు ఇస్తారన్న నమ్మకంతో జిల్లా ప్రజలు ఉన్నారు. తాను పుట్టిన గడ్డపై నిర్వహిస్తున్న ఈ పండుగ వేడుకలలో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతన్నకే కాకుండా రాష్ట్ర రైతాంగానికి అంతటికిని మేలు చేసే హామీలు ఉంటాయి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Similar News