దిశ, జడ్చర్ల : బోనాల పండుగకు వెళ్లి ఆనందంగా గడిపారు. తిరిగి ఇంటిబాట పడుతుంటే మధ్యలో అనంతలోకాలకు పయనమయ్యారు తల్లి, కూతుర్లు. ఈ ఘటన గురువారం జడ్చర్ల మండలంలో చోటుచేసుకుంది. జడ్చర్ల మండలం లింగంపేట గ్రామానికి చెందిన రేఖ (23) తన కూతురు సాత్విక (4)తో కలిసి తన తల్లి గారి ఉరు అయిన నాగర్ కర్నూలు జిల్లా ఎదిరేపల్లికి రాఖీ పౌర్ణమి సందర్భంగా వెళ్లారు. రాఖీ పౌర్ణమి ముగిశాక మృతురాలి చెల్లి బోనాల పండుగ ముగించుకొని వెళ్లాల్సిందిగా కోరింది. దీంతో బోనాల పండుగ ముగిశాక మృతురాలి భర్త అయిన చెన్నకేశవులు లింగంపేట గ్రామంలో బోనాల పండుగ ఉంది త్వరగా రావాలని తన భార్యను కోరాడు. దీంతో తన చెల్లెలు భర్త ఆయన ఆంజనేయులుతో కలిసి బైక్ మీద ఎదిరేపల్లి నుండి లింగంపేట గ్రామానికి బయలుదేరింది. ఈ క్రమంలో గంగాపూర్-కోడుగల్ రహదారిలో ఫర్టిలైజర్ లోడ్ తో వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే కార్యక్రమంలో లారీ బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ అదుపుతప్పి తల్లీకూతురు రోడ్డుపై పడగా బైక్ కు పక్కకు వెళ్లింది. దీంతో రోడ్డుపై పడ్డ తల్లి కూతురుపై నుండి లారీ వెళ్లడంతో వారి తలభాగాలు చిత్రమై అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ నడుపుతున్న ఆంజనేయులు ఎలాంటి గాయాలు కాకుండానే ప్రాణాల నుండి బయటపడ్డాడు.
ఈ విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు కుటుంబ సభ్యులు గంగాపూర్-కొడంగల్ వెళ్లే రహదారిపై ముళ్ల కంప వేసి రహదారిని పూర్తిగా మూసేసి రాకపోకలను అడ్డుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలని రహదారి వెడల్పు లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని వారు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ ఆదిరెడ్డి, తాసిల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో ఆనంద్ ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు. కాగా సుమారు మూడు గంటల నుండి గంగాపూర్-కొడంగల్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక భర్త చెన్నకేశవులు కంటతడి పెట్టుకోవడం అందరినీ కలిచివేసింది.