రైతులను దోచుకుంటున్న మిల్లర్లు..

పట్టణంలోని రైస్ మిల్లర్లు తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని యువజన కాంగ్రెస్ తాలుకా అధ్యక్షులు అనిల్ గౌడ్, మండల అధ్యక్షులు బీస బాలరాజు ఆరోపించారు.

Update: 2023-06-16 14:12 GMT

దిశ, కల్వకుర్తి : పట్టణంలోని రైస్ మిల్లర్లు తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని యువజన కాంగ్రెస్ తాలుకా అధ్యక్షులు అనిల్ గౌడ్, మండల అధ్యక్షులు బీస బాలరాజు ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకి సరైన మద్దతు ధరనే లేదని, దీనికి తోడు దళారుల దోపీడిలు ఎక్కువయ్యి రైతులు లబోదిబోమంటున్నారన్నారు. శుక్రవారం వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు కృష్ణారెడ్డి పండించిన 270 బస్తాల వరి ధాన్యాన్ని స్థానిక సద్గురు రాఘవేంద్ర మిల్లుకు తీసుకరాగ, ఒక్కో బస్తాకు 4 కిలోల తరుగు తీస్తామనడంతో ఖంగుతిన్నాడన్నారు. విషయం తెలుసుకున్న యువజన కాంగ్రెస్ తాలుకా అధ్యక్షులు అనిల్ గౌడ్, మండల అధ్యక్షులు బీస బాలరాజులు అక్కడికి వెళ్ళి ప్రశ్నించగా మాకు తెలిదని మిల్లు యజమానితో మాట్లాడుకోవాల్సిందిగా సమాధానమిచ్చారన్నారు.

ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల శాఖఅధికారితో చరవాణిలో మాట్లాడగా తనకేమీ తెలియదన్నట్లు మాట్లాడారన్నారు. ప్రభుత్వ అధికారులు అండదండలతోనే మిల్లర్లు రైతుల దగ్గర దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఒక పక్క 2 కిలోల తరుగు మాత్రమే తీయాలని చెప్పిన, మిల్లర్లు క్వింటాలుకు 10 కిలోలు తరుగు తీస్తుంటే నిమ్మకి నీరెత్తినట్లు అధికారులు వ్యవహరించడం దారుణమన్నారు. వెంటనే ప్రభుత్వం ఇలాంటి మిల్లుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని తెలిపారు.

Tags:    

Similar News