ఎవరిని ఉపేక్షించేదే లేదు : గువ్వల బాలరాజు
గురుకులం పాఠశాల విద్యార్థిని నిఖిత మృతిపై పలు అనుమానాలు ఆరోపణలు వ్యక్తమవుతున్న తరుణంలో... Guvvala Balaraju press meet
దిశ, అచ్చంపేట: గురుకులం పాఠశాల విద్యార్థిని నిఖిత మృతిపై పలు అనుమానాలు ఆరోపణలు వ్యక్తమవుతున్న తరుణంలో అదే నిజమైతే రీపోస్టుమార్టం సందర్భంగా వాస్తవాలు బయటికి వస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిఖిత రీపోస్టుమార్టంపై ప్రభుత్వంతో సంప్రదించి అనుమానాలను నివృత్తి చేయడం జరుగుతుందని, ఒకవేళ రీపోస్టుమార్టంలో బాధ్యులుగా తేలుతే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతోపాటు వారి ఉద్యోగం నుంచి తీసివేయడం జరుగుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా సంఘటన జరిగిన విషయం తన దృష్టికి రాగానే ఆ సందర్భంలో తాను కర్ణాటకలో ఉండి స్థానిక ఎస్పీ డీఎస్పీతో మాట్లాడాలని, అలాగే మరుసటిరోజు బాధ్యత గల శాసనసభ్యుడిగా పాఠశాలలను సందర్శించి ప్రమాద విషయంపై ఆరా తీయడంతోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ కుటుంబానికి ప్రభుత్వపరంగా అన్ని విధాల ఆదుకునేలా ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్, దళిత బంధు తదితర అవకాశాలు కల్పించే విధంగా పూర్తి బాధ్యత తీసుకుంటానని ఆరోజే బాధిత కుటుంబానికి హామీ ఇచ్చిన విషయం గుర్తుచేశారు.
అలాగే విద్యార్థులు ఆందోళనకు గురై ఇంటికి వెళుతున్న నేపథ్యంలో పరీక్షల సమయం గనుక విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ధైర్యం కల్పించేలా అవగాహన కల్పించామన్నారు. ఇంటికెళ్లిన విద్యార్థులను కూడా త్వరగా పాఠశాలకు రప్పించేలా పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు. అలాగే మందకృష్ణ మాదిగ అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం తప్పు పట్టడం లేదన్నారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా బాధ్యతగల దళిత బిడ్డగా, శాసన సభ్యుడిగా వ్యవాహరిస్తానని మరోసారి ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మనోహర్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నకేశవులు, జెడ్పీటీసీ రాంబాబు, అమ్రాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మద్దిమడుగు పాలకమండలి సభ్యులు నిమ్మల శ్రీనివాసులు, సర్పంచ్ శ్రీరామ్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ తులసిరాం తదితరులు ఉన్నారు.