స్వయం ఉపాధి కల్పనే ప్రభుత్వ ధ్యేయం

స్వయం ఉపాధి అవకాశాలు కల్పనే ప్రభుత్వ ధ్యేయమని నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవి అన్నారు.

Update: 2024-10-22 13:52 GMT

దిశ నాగర్ కర్నూల్ :- స్వయం ఉపాధి అవకాశాలు కల్పనే ప్రభుత్వ ధ్యేయమని నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవి అన్నారు. దేశంలోనే మొదటిసారిగా నాగర్ కర్నూల్ జిల్లాలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. మంగళవారం పట్టణంలోని తేజ కన్వెన్షన్ హాల్ లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.పార్లమెంటు పరిధిలోని చిన్న మధ్య తరహా పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువత కు స్వయం ఉపాధి, ఆర్థికంగా ఎలా బలపడాలి, వారి ప్రాంతాలకు ఎలాంటి పరిశ్రమలు నిర్మించుకోవాలి అనే అంశాల మీద అహగాహన సదస్సు లో ఎంపీ డాక్టర్ మల్లు రవితో కలిసి ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. విద్య నైపుణ్యం తో పాటు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యువత స్వయం ఉపాధి లక్ష్యంగా కృషి చేయాలని మంత్రి అన్నారు. ప్రభుత్వ రంగంలో వందమందికి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ప్రైవేట్ రంగంలో 99 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలతో పాటు..యువతకు ఉద్యోగ కల్పనపై అవగాహన కల్పించేందుకు 50 లక్షల రూపాయలను తన నిధులతో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అందుకు జిల్లాల కలెక్టర్లు ప్రతి జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించేలా సమాచారాన్ని పొందుపరిచి ఒక పుస్తకం రూపంలో రూపొందించాలని సూచించారు. ప్రతి విద్యార్థికి అంతర్జాతీయ నైపుణ్య అవకాశాలను కల్పించాలన్న ఉద్దేశంతోనే తన నిధుల నుంచి అధిక శాతం నిధులు విద్యా రంగానికే ఖర్చు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 50వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒక నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో..యువతకు ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, వివిధ సంస్థల ప్రైవేటు రంగాల్లో యువతకు నైపుణ్య అవకాశాలు,శిక్షణ, అవగాహన కనిపించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, అచ్చంపేట,కల్వకుర్తి,వనపర్తి ఎమ్మెల్యేలు, కలెక్టర్లు,అడిషనల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


Similar News