బాల్య వివాహాలు చేసుకుంటే భవిష్యత్తు అంధకారం

బాల్యవివాహాలు చేసుకుంటే భవిష్యత్తు అంధకారం అవుతుందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు.

Update: 2024-11-27 10:09 GMT

దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: బాల్యవివాహాలు చేసుకుంటే భవిష్యత్తు అంధకారం అవుతుందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా కేంద్ర సమీపంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కళాశాలలో నిర్వహించిన.. న్యాయ అవగాహన సదస్సు లో ఆమె ప్రసంగించారు. 18 ఏండ్లు దాటని బాలికలు పెళ్లిళ్లు చేసుకుంటే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలతో పాటు..పుట్టబోయే పిల్లలు అనారోగ్యంతో పుట్టి,వివిధ లోపాలతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందన్నారు. తమ తల్లిదండ్రులు ఎవరైనా పెళ్లిళ్లు చేసుకోవాలని ఒత్తిడి చేస్తే,బాల్య వివాహాలు చేసుకోమని చెప్పాలని,తద్వారా భవిష్యత్తులో జరిగే ఇబ్బందులను వివరించాలని సూచించారు. బాల్య వివాహాల నియంత్రణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని,ఎక్కడైనా బాల్యవివాహాలు చేసేందుకు ఒత్తిడి తీసుకొస్తే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సదస్సులో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి,పారా లీగల్ వాలంటీర్ పి.యాదయ్య,కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News