పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా రైతు పండుగ

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంలో భాగంగా ఈనెల 28 నుంచి మూడు రోజులపాటు రైతు పండుగ నిర్వహిస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలిపారు.

Update: 2024-11-27 12:56 GMT

దిశ, భూత్పూర్ : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంలో భాగంగా ఈనెల 28 నుంచి మూడు రోజులపాటు రైతు పండుగ నిర్వహిస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలిపారు. బుధవారం భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిసపూరు గ్రామ శివారులో రైతు పండుగ ఏర్పాట్లను ఆయన పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందని చెప్పారు. రుణమాఫీ,ఉచిత విద్యుత్తు అమలు చేయడంతో పాటు త్వరలోనే రైతుబంధు పథకం అమలుకు సంబంధించి..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారని ఆయన తెలిపారు. రైతు పండుగ సందర్భంగా మూడు రోజులపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చే రైతులకు వ్యవసాయ రంగంలో మరింత ప్రగతిని సాధించేందుకు శాస్త్రవేత్తలు అవసరమైన సలహాలు, సూచనలు చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. గురువారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజ నరసింహ, జూపల్లి కృష్ణారావు హాజరై కార్యక్రమాలను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ ను, ఇతర ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో భూత్పూర్ మాజీ ఎంపీపీ కదిరి శేఖర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఆర్య నాయక్, నాగిరెడ్డి, విజయ్ గౌడ్, మాస గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


Similar News