కాగుతున్న వేడి నూనె పడి విద్యార్థికి గాయాలు
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జల్సా అనే విద్యార్థిని కాగుతున్న వేడి నూనె పడి గాయాలయ్యాయి.
దిశ,నవాబుపేట : మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జల్సా అనే విద్యార్థిని కాగుతున్న వేడి నూనె పడి గాయాలయ్యాయి. సంఘటన గురించి తెలుసుకున్నకేజీబీవీ ఇంచార్జి ప్రిన్సిపాల్ ప్రశాంతి విద్యార్థినికి ప్రథమ చికిత్స అందించి..విశ్రాంతి కోసం వారి స్వగ్రామమైన కిషన్ గూడకు పంపించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా రాష్ట్రం మొత్తం రావణ కాష్టంగా మండుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ మాధవిని దిశ ప్రతినిధి వివరణ కోరగా.. కేజీబీవీ పాఠశాలలో 373 మంది విద్యార్థినులకు ఏకకాలంలో అల్పాహారం తయారు చేయడం ఇద్దరు వంట మనుషులకు సాధ్యపడదని, అందువల్ల విద్యార్థినులతో పూరీలు తయారు చేయించి వాటిని వంట మనుషులతో బాణలిలో వేయించి విద్యార్తినులకు అందిస్తామని తెలిపారు. జిల్లాలోని మిగతా కేజీబీవీ పాఠశాలల్లో కూడా ఇదే విధమైన విధానాన్ని అవలంబిస్తారని ఆమె తెలిపారు. అయితే తాను గత కొన్ని రోజులుగా సెలవులో ఉన్నానని, సంఘటన జరిగిన విషయం వాస్తవమేనని, అయితే పత్రికలలో రాసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేయకూడదన్నారు. పాఠశాలలో అంతా సవ్యంగా జరుగుతుందన్నారు. చిన్న సంఘటనను పెద్దగా చేసి చూపడం వల్ల అందరి దృష్టి తమ పాఠశాలపై పడుతుందని ఆమె అన్నారు. ఫుడ్ పాయిజన్ కారణంగా ప్రభుత్వ వసతి గృహాలలో, పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్న ఈ సమయంలో..కేజీబీవీ పాఠశాలల్లో సహకారం పేరుతో నిరుపేద విద్యార్థినులతో వెట్టిచాకిరి చేయించడం విద్యార్థుల తల్లిదండ్రులలో వణుకు పుడుతుంది. తమ ఇళ్ల దగ్గర ఉంచుకొని చదివిస్తే విద్యార్థుల పనులలో పడి చదువు సక్రమంగా చదువుకోరని వసతి గృహాలకు పంపితే..అక్కడ కూడా వారితో పనులు చేయిస్తే ఇక వారి చదువులు ఎలా సక్రమంగా కొనసాగుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.