రైతును రాజు చేయడమే ప్రభుత్వం ధ్యేయం
రైతును రాజును చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని,రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: రైతును రాజును చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని,రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ నెల 30 న జిల్లాలో నిర్వహించే రైతు పండుగ ను పురస్కరించుకుని చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,ఎస్పీ జానకి తో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 150 స్టాల్స్ ను గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ప్రారంభించడం జరుగుతుందని,ఈ స్టాల్స్ వద్ద మూడురోజుల పాటు రైతులు వాడుతున్న మిషనరీలు తదితర ఆధునిక వ్యవసాయ పనిముట్లతో పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు అత్యాధునిక సాంకేతిక పద్ధతుల పైన అధికారులు అవగాహన కల్పించడం,శిక్షణ ఇవ్వడం జరుగుతుందని,ఇక్కడికి వచ్చే 5000 మంది రైతులకు ప్రతి రోజు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఒకే సంవత్సరంలో రైతు రుణమాఫీ తో పాటు,రైతు భరోసా ఇచ్చామన్నారు. దేశంలో ఎక్కడా ఎవరూ చేయలేని సాహసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధ్యం అయిందని,రైతు కళ్ళలో ఆనందం నింపడానికి,రైతులు సంక్షేమం కోసం,రైతుల అభివృద్ధి కోసం మేము పనిచేస్తున్నామన్నారు. ఈ రైతు పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ రైతులకు ప్రపంచంలో ఉన్న అత్యాధునిక సాంకేతికతను,ఇతర రాష్ట్రాలలో ఉన్న కొత్త వ్యవసాయ పద్దతులను,అత్యాధునిక సాగు పద్ధతులను మన రైతులకు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సత్యనారాయణ,మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి,సిరాజ్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.