గురుకులంలో విద్యార్థి సూసైడ్.. అసలు ఏం జరిగింది..?
వనపర్తి జిల్లా మదనాపురం రెసిడెన్షియల్ స్కూల్ (బాలుర గురుకులం)లో 7వ తరగతి చదువుతున్న ప్రవీణ్ (14) అనే విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
దిశ ,మదనాపురం : వనపర్తి జిల్లా మదనాపురం రెసిడెన్షియల్ స్కూల్ (బాలుర గురుకులం)లో 7వ తరగతి చదువుతున్న ప్రవీణ్ (14) అనే విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలలోకి వెళితే ..మండల పరిధిలో కొన్నూర్ చెందిన తప్పెడ శ్రీనివాసులు, సత్యమ్మ దంపతులు తమ పిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. వారి చిన్నకుమారుడు ప్రవీణ్ కు హైదరాబాద్ లోనే గురుకుల పాఠశాలలో సీటు వచ్చింది. అక్కడే చదువుతుండగా తల్లిదండ్రులు తిరిగి తమ సొంత ఊరుకు రావాలని ఉద్దేశంతో..తమ కుమారుడిని మదనాపూర్ గురుకుల పాఠశాలలో వారం రోజుల క్రితం చేర్పించారు. మంగళవారం రోజు కబడ్డీ ఆడుతుండగా చిన్నపాటి గాయం తగిలింది. ఈ విషయాన్ని తండ్రికి ఫోన్ చేసి తెలియజేసి..తనను ఇంటికి తీసుకెళ్లాలని కోరినట్లు తెలిసింది. దీంతో తండ్రి తన కుమారుడికి సర్ది చెప్పి బుధవారం ఉదయం మీ బాబాయిని పంపిస్తానని చెప్పి బుజ్జగించినట్లు సమాచారం. ఈరోజు ఉదయం విద్యార్థులు అల్పాహారం తీసుకున్న తర్వాత అందరూ విద్యార్థులు తరగతి గదులకు వెళ్లగా ప్రవీణ్ తాను ఉంటున్న గదిలోకి వెళ్లి..ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనను గుర్తించిన ఇతర విద్యార్థులు వెంటనే ప్రిన్సిపల్ ఉపాధ్యాయులకు తెలియజేశారు. వారు హుటాహుటిన వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. సంఘటన ఉదయం జరిగినప్పటికి మధ్యాహ్నం వరకు విషయం వెలుగులోకి రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ విషయం క్షణాలలో బయట తెలిసిపోవడంతో..కొంతమంది ఆందోళనకు దిగారు. గురుకుల పాఠశాల గేట్లను తెరుచుకొని వెళ్లి..చూడడంతో విద్యార్థి మృతి చెందిన సంఘటన బహిర్గతం అయ్యింది. కాగా విద్యార్థి మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఆసుపత్రికి తరలించారు. తాహసిల్దార్ అబ్రహం లింకన్,డిఎస్పి వెంకటేశ్వర్లు,సీఐశివ కుమార్ ఎస్ఐలు శేఖర్ రెడ్డి, మంజునాథ్ రెడ్డి, సంఘటన చేరుకొని దర్యాప్తు చేపట్టారు.