దసరా పండుగ తెచ్చిన తంట..ప్రయాణికుల మంట
దసరా పండుగ సందర్భంగా ఆర్టీసి అధికారులు అదనపు చార్జీలు పెంచి.. వసూలు చేయడంతో ప్రయాణికులు మండి పడుతున్నారు.
దిశ,కొల్లాపూర్: దసరా పండుగ సందర్భంగా ఆర్టీసి అధికారులు అదనపు చార్జీలు పెంచి.. వసూలు చేయడంతో ప్రయాణికులు మండి పడుతున్నారు. ఆర్టీసీ కండక్టర్లు ప్రయాణికుల నుంచి ముక్కు పిండి అదనపు చార్జీలు వసూలు చేయడం.. ఇదేనా ప్రజా పాలన అంటూ ప్రభుత్వ తీరు పై ప్రయాణికులు విమర్శిస్తున్నారు. ఇదేంటని కండక్టర్ ను నిలదీస్తే తమకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నుంచి అదేశాలున్నాయని చెబుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు. మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రవేశ పెట్టిన ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా.. బసుల్లో ప్రయాణిస్తే తమ నెత్తిన పిడుగు లాంటి అదనపు చార్జీల భారం మోపడం సమంజసమేనా అని ఆర్టీసీ అధికారుల వైఖరిని ప్రయాణికులు నిలదీస్తున్నారు. కొల్లాపూర్ నుంచి హైద్రాబాద్ కు ఎక్స్ప్రెస్ బస్సు చార్జి టికెట్ ధర సాధారణంగా రూ,260లు ఉండగా.. పండుగ సీజన్ లో రూ,390లు పెంచారు. అంటే ఒక టికెట్ పై అదనంగా రూ,130 లు వసూలు చేస్తున్నారు. అలాగే డీలక్స్ బస్ కు సాధారణంగా ఒకరికి టికెట్ ధర రూ,280లు ఉండగా . పండుగ సీజన్ లో రూ,420లు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారు. అంటే అదనంగా రూ,140లు ప్రయాణికుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. అయితే కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ కు ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అదనపు చార్జీలు వసూళ్లపై కండక్టర్లతో వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆర్టీసీ ఉన్నతాధికారులు పండుగ సీజన్లో అనాలోచిత నిర్ణయాలను తీసుకుని అదనపు చార్జీలను వసూలు చేయడానికి ప్రయాణికులు మండిపడుతున్నారు. త్వరలో నే రానున్న దీపావళి పండుగ సందర్భంగా..ఇలాగే అదరపు చార్జీలు వసూలు చేస్తే ఆర్టీసీ అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా బస్సు డిపోల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రయాణికులు హెచ్చరిస్తున్నారు.