డబుల్...గుబుల్..అసలేం జరిగిందంటే..?
మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపుల వ్యవహారం .. అనర్హుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపుల వ్యవహారం .. అనర్హుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ని డివిటి పల్లిలో 1024, వీరన్నపేటలో 660, క్రిస్టియన్ పల్లిలో 310, ఏనుగొండలో 588 ఇండ్లు నిర్మాణం చేసి లబ్ధిదారులకు గత ప్రభుత్వ హయాంలో అధికారులు కేటాయించారు. ఈ కేటాయింపులు ప్రభుత్వ ఉత్తర్వులు 4,10,12 లను పాటించకుండా ఇష్టం వచ్చినట్లుగా కేటాయింపులు చేశారని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు..పెద్ద ఎత్తున స్థానికేతరులకు కూడా ఈ ఇండ్లను కేటాయించారని స్థానికులు వాపోతున్నారు. అర్హులైన బీదలు , స్థానికులకు కాకుండా ఏమాత్రం అర్హతలు లేని వారికి ఈ ఇండ్లను కేటాయించారని ఫిర్యాదులు వెళ్లాయి. ఈ కేటాయింపులలో లక్షలాది రూపాయలు చేతులు మారాయన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పలుమార్లు విచారణ జరిపి నివేదికలను అధికారులకు ఇచ్చారు. ఇప్పటికే ఏనుగొండలోని 588 ఇండ్ల కు సంబంధించి అర్హులు, అనర్హులకు సంబంధించిన తుది జాబితాను రూపొందించిన అధికారులు డివిటిపల్లి, వీరన్నపేట, క్రిస్టియన్ పల్లి ఇండ్లకు సంబంధించిన అవకతవకలపై విచారణ జరిపేందుకు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం మొత్తం 15 మంది అధికారులను నియమించారు. ఈ అధికారులు ఈనెల 23 నుంచి ఇంటింటి సమగ్ర సర్వే నిర్వహించి..తుది నివేదికను కలెక్టర్ కు సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో స్థానికేతరులు, ఉద్యోగులు, కార్పొరేటు స్థాయి ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగులను అనర్హులుగా ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.