ముఖ్యమంత్రిని ఢీ కొట్టిన గెలుపు ఇది.. డీకే అరుణ

పార్లమెంటు సభ్యురాలిగా తన గెలుపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢీ కొట్టిన గెలుపు అని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు.

Update: 2024-07-04 17:09 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : పార్లమెంటు సభ్యురాలిగా తన గెలుపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢీ కొట్టిన గెలుపు అని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు. గురువారం స్థానిక అన్నపూర్ణ గార్డెన్స్ లో తనను గెలిపించిన కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన 'కృతజ్ఞత సభ' లో ఆమె ఉద్వేగంగా ప్రసంగించారు.తన గెలుపు ఆషామాషీ గెలుపు కాదని, ముఖ్యమంత్రి సొంత జిల్లా అని, ఇక్కడ ఇంకొకరు గెలవకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశారని, దాదాపు 10 సార్లు పర్యటించి ప్రతిష్టాత్మకంగా తీసుకొని, హైదరాబాద్ లో రహస్య సమావేశాలు నిర్వహించారని అన్నారు. ఇక్కడి కార్యకర్తలను ఎన్నో ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురి చేశారని ఆమె ఆరోపించారు.

అన్ని ప్రయత్నాలను తిప్పికొట్టి, తనకు ఓటు వేసిన ఓటరు మహశయులందరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ దేశం భద్రంగా ఉండాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతిలోనే ఉండాలని ప్రజలు నిర్ణయించుకొని బీజేపీ ఓటు వేసి తనను గెలిపించారని ఆమె అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీతో డీకే అరుణ ను ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ రెడ్డి, నాయకులు టి.ఆచారి, కె.సుధాకర్ రెడ్డి, నాగురావు నామాజి, పద్మజారెడ్డి, బాలాత్రిపుర సుందరి, శ్రీవర్దన్ రెడ్డి, కొండయ్య, పగడాల శ్రీనివాస్, నర్సింహారెడ్డి, జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.


Similar News