ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ?.. వీరి చేరికకు సర్వం సిద్ధం!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది.

Update: 2024-07-07 11:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది.ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీలో మిగిలి ఉన్న నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, సహా పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపధ్యంలోనే శనివారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. ఇప్పుడు మరో ఇద్దరు నేతలు కూడా అదే బాట పట్టనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే విజయుడు, ఎమ్యెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి లు త్వరలో బీఆర్ఎస్ ను వీడనున్నారని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇరువురు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. వీరి చేరికకు ముహుర్థం కూడా ఖరారు అయ్యిందని పార్టీ వర్గాల సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు గెలుచుకోగా.. బీఆర్ఎస్ కేవలం రెండు సీట్లతోనే సరిపెట్టుకుంది. ఇందులో గద్వాల ఎమ్మె్ల్యేగా ఉన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. ఇప్పుడు అలంపూర్ ఎమ్మె్ల్యే విజయుడు తో పాటు జిల్లాలో పార్టీ కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి సైతం కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారని వార్తలు ఊపందుకున్నాయి.

వీరిద్దరు పార్టీని వీడితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పార్టీ మారేందుకు సిద్దమైన నేతలకు స్వయంగా ఫోన్ చేసి బుజ్జగించే ఇచ్చే పనిలో ఉన్నారని సమాచారం. పార్టీ మారొద్దని, బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే మళ్లీ పుంజుకుంటుందని, భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్యాక, పార్టీలో కొనసాగిన వారికి సముచిత గౌరవం ఇస్తామని కేటీఆర్ భరోసా ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్ ఫామ్ హౌజ్ కి పిలిచి భరోసా ఇస్తేనే మాట వినని నేతలు.. కేటీఆర్ చెబితే వింటారా అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.


Similar News