MLC AVN Reddy : ఉపాధ్యాయుడు లేకపోతే సమాజమే లేదు..
ప్రభుత్వ విద్యను పటిష్ఠం చేయాలని.. ఉపాధ్యాయుడు లేకపోతే సమాజమే లేదని..
దిశ, నారాయణపేట ప్రతినిధి : ప్రభుత్వ విద్యను పటిష్ఠం చేయాలని.. ఉపాధ్యాయుడు లేకపోతే సమాజమే లేదని.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి ఉపాధ్యాయులకు న్యాయబద్ధంగా కల్పించాల్సిన హక్కులు.. వసతులు.. పదోన్నతులు కల్పిస్తేనే వందకు వంద శాతం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు. గురుపౌర్ణిమ సందర్భంగా నారాయణపేట జిల్లా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమాన్ని అంజనా గార్డెన్స్ లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. తాను ఎవరికి భయపడాల్సిన పనిలేదని.. తాను లబ్ధి పొందేదుకు ఎవరికి లొంగేపని అంతకన్నా లేదన్నారు. ఉపాధ్యాయులకు సేవ చేయడమే తన ప్రథమ కర్త్యవమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18,000 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందారన్నారు.
ఉపాధ్యాయులు ఎల్లపుడూ నేర్చుకుంటూ నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం పని చేయాలన్నారు. వెనకబడిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రసాద్ కు టెట్ నిర్వాహణ, ఉపాధ్యాయుల సమస్యల పై ఈ మధ్యనే ఢిల్లీలో తాను విన్నవించారని, సభ దృష్టికి తీసుకోవచ్చారు. 317 జీవో వల్ల అన్యాయం జరిగిన ఉపాధ్యాయులకు న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. NCTE రూల్స్ లో మార్పులు చేయాలని కోరారని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు.. ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. తపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంత్ రావు, మల్లికార్జున్, గుంపు బాల్ రాజ్, జిల్లా అధ్యక్షులు షేర్ కృష్ణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఎమ్మెల్సీకి నారాయణపేట జిల్లా తపస్ శాఖ వినతి..
నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డికి నారాయణపేట జిల్లా తపస్ శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలు అందించాలని.. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని.. బీఈడీ ఉన్న వారికి పదోన్నతి కల్పించడంతో పాటు.. ప్రభుత్వ పాఠశాలల పాత సమయాలని కొనసాగించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి.. విద్యా వాలంటీర్లను నియమించాలి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలని తదితర డిమాండ్లతో వినతిపత్రం అందించారు.