అధిష్టానంతో అమీతుమీ.. స్వరం పెంచిన జూపల్లి

2018 ఎన్నికలలో ఓటమి చెందడం.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్‌లో చేర్చుకోవడంతో రాష్ట్ర మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన ఉనికిని కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నాయని గుర్తించి అధికార పార్టీలోనే కొనసాగుతూ. స్థానిక సంస్థల ఎన్నికలలో తన సత్తా చాటుకున్నారు..

Update: 2023-04-09 02:16 GMT

దిశ బ్యూరో, మహబూబ్‌ నగర్: 2018 ఎన్నికలలో ఓటమి చెందడం.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్‌లో చేర్చుకోవడంతో రాష్ట్ర మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన ఉనికిని కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నాయని గుర్తించి అధికార పార్టీలోనే కొనసాగుతూ... స్థానిక సంస్థల ఎన్నికలలో తన సత్తా చాటుకున్నారు. క్రమక్రమంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పూర్వ వైభవం కోసం విశ్వప్రయత్నాలు చేస్తూఅడుగులు ముందుకు వేస్తూ వస్తున్నారు. అధికార పార్టీలో ఉంటూనే.. అధికార పార్టీ ఎమ్మెల్యే పై విమర్శల వర్షం గుప్పిస్తూ వచ్చారు. ఈ సందర్భంలో జూపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లాయి. కానీ అధిష్ఠానం జూపల్లిపై చర్యలు తీసుకోవడానికి సాహసించలేదు.

పలు సందర్భాలలో సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్‌ను జూపల్లి కలిసేందుకు ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తప్పనిసరిగా అధికార పార్టీ టికెట్ తనకే వస్తుందని భావించిన.. సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించడం, తదితర కారణాలతో ఇన్నాళ్లు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న జూపల్లి తనకు పార్టీ టికెట్ లభించే అవకాశం లేదనుకున్నారో ఏమో.. ఒక్కసారిగా తన స్వరాన్ని మార్చారు. రైతులకు సాగునీటి వనరులను ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూనే మరోవైపు స్థానిక నేతల వైఫల్యం వల్లే వేలాది ఎకరాలలో పంట పొలాలు ఎండిపోతున్నాయని ఇటీవల ఆరోపణలు చేశారు. సాగునీటి కోసం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాదయాత్రలు చేయడానికి జూపల్లి సిద్ధం అవుతున్నారు..

పార్టీ మారెందుకేనా..?

జూపల్లి కృష్ణారావు తనను సస్పెండ్ చేస్తే పార్టీ విషయంపై స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం లేదా ఏదైనా పార్టీలో చేరేందుకే ప్రభుత్వంపై తాడోపేడో తెలుసుకోవడానికి జూపల్లి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నట్లు భావిస్తున్నారు.

ఎటు తేల్చలేని పరిస్థితిలో పార్టీ..

జూపల్లి కృష్ణారావును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అతనికి సానుభూతి తోడవుతుందనే ఉద్దేశంతో... పొమ్మనలేక పొగ పెడుతున్నట్లు అధికార పార్టీ అధిష్ఠానం వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు తానుగా వెళ్లకుండా.. బీఆర్ఎస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయం కోసం జూపల్లి ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News