దిలావర్పూర్-రామన్నపేటను రావణకాష్టం చేసినందుకు రైతు పండుగలా: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు పండుగా.. కార్యక్రమంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు పండుగా.. కార్యక్రమంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. రైతు పండగపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. దిలావర్పూర్-రామన్నపేటను రావణకాష్టం చేసినందుకు రైతు పండుగలా అంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేటీఆర్ ట్వీట్లో "పంటల కొనుగోళ్లకు శఠగోపం పెట్టి-ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఎగ్గొట్టి... దిలావర్పూర్ లో దమనకాండ సృష్టించి-రామన్నపేటను రావణకాష్టం చేసి.. లగచర్ల రైతులను జైలుపాలు చేసి అల్లుడి కళ్ళలో ఆనందం చూసినందుకు.. రైతు పండుగలా ?.. పండుగలు మీకు-పస్తులు రైతులకా..
చెప్పింది బారాణ-చేసింది చారాణా
కల్లాల్లో ధాన్యం పోసి, కళ్లల్లో వత్తులు వేసుకుని, కొనుగోళ్ల కోసం రైతులు ఎదురు చూస్తుంటే.. నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి కొనుగోలు చేపట్టకపోవడంతో.. అడ్డికి పావుశేరు లెక్కన దళారులకు అమ్ముకుంటున్నారు. అబద్దానికి అంగీ, లాగు తొడిగితే అది కాంగ్రెస్ సర్కార్ అన్ని రాసుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ చేస్తున్న ఈ విజయోత్సవాలు ఎందుకని.. రైతులను నిండా ముంచినందుకా ? వ్యవసాయాన్ని ఆగం చేసినందుకా ? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.