KCR Big Sketch: కేటీఆర్ అమెరికాకు, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కవిత.. కేసీఆర్ బిగ్ స్కెచ్ ఇదేనా?

రాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే పెను మార్పులు రాబోతున్నాయా?

Update: 2024-08-29 07:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా బయలుదేరి వెళ్లారు. తన చెల్లి, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలై నిన్న రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అనంతరం గంటల వ్యవధిలోనే కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఆయన కుమారుడు హిమాన్షు‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారుడి చదువుకు సంబంధించే అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ‘యునైటెడ్ స్టేట్స్ బయలుదేరాను, తండ్రి బాధ్యత పిలుస్తోంది’ అనే అర్థం వచ్చేలా కేటీఆర్ ఇవాళ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కవితకు మంగళవారం బెయిల్ లభించడంతో బుధవారం ఢిల్లీ నుంచి కవితతో పాటు కేటీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. కవిత నివాసంలో కాసేపు కుటుంబ సభ్యులతో గడిపిన కేటీఆర్ అటునుంచి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని యూఎస్ బయలుదేరి వెళ్లారు.

ఎవరెవరిని కలుస్తారనేదానిపై ఉత్కంఠ...

కుమారుడి కోసమే కేటీఆర్ అమెరికా వెళ్తున్నట్లు పైకి ప్రచారం జరుగుతున్నా అసలు మతలబు మరొకటి ఉందనే చర్చ పొలిటికల్ కారిడార్‌లో గుప్పుమంటోంది. రాష్ట్రంలో రోజురోజుకూ బలహీనపడుతున్న పార్టీ బలోపేతానికి వ్యూహరచన అంతా విదేశాల్లో జరిగేలా కేసీఆర్ ప్లాన్ చేశారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. ఎటువంటి సమాచారం లీకు కాకూడదనే ఉద్దేశంతో ఓ జాతీయ పార్టీతో బీఆర్ఎస్ కలిసి పని చేసే విషయం, పార్టీ ఫ్యూచర్ ప్లాన్‌పై డిస్కషన్ అంతా విదేశాల్లో జరిగేలా స్కెచ్ వేశారనే టాక్ వినిపిస్తున్నది. ఈ చర్చల కోసం పార్టీ కీలక నేతలను చైనా, రష్యా, యూకే, యూఎస్ఏ దేశాలకు తీసుకువెళ్లి అక్కడ చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ అమెరికా వెళ్లడం, ఆ తర్వాత వెంటనే వచ్చే నెల 5 నుంచి 7 వరకు రష్యా రాజధాని మాస్కోలో స్కోల్ కోవో సంస్థ నిర్వహించే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతుండటం ఆసక్తిగా మారింది. కేటీఆర్ వరుస టూర్ల వెనుక ఏం జరుగుతోందనే చర్చ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నది. ఓ వైపు కవిత బెయిల్ వెనుక బీఆర్ఎస్ బీజేపీతో కాంప్రమైజ్ అయిందనే టాక్ గుప్పుమంటున్న వేళ.. కేటీఆర్ యూఎస్, రష్యా టూర్లలో ఎవరెవరిని కలవనున్నారు? గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయంతో ఉన్నారనేది పార్టీ కేడర్‌లో ఉత్కంఠగా మారింది.

దయచేసి ఎవరూ రావొద్దు...

మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఇవాళ తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవెళ్లి ఫామ్‌హౌస్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ కేసీఆర్‌తో కవిత భేటీ కాగా పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కాగా దాదాపు 5 నెలలకు పైగా జైలు జీవితం గడిపిన అనంతరం మరో వారం పది రోజులు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు, సహకరించాలని.. దయచేసి తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని ఆమె రిక్వెస్ట్ చేశారు. అయితే ఈ పది రోజులు కవిత, కేసీఆర్ మధ్య ఎలాంటి పొలిటికల్ డిస్కషన్స్ ఉండబోతున్నాయనేది రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్‌గా మారింది. 160 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత కవిత సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. భర్త అనిల్​, సోదరుడు కేటీఆర్‌తో ఉన్న ఫొటోను ఆమె షేర్ చేశారు. దీనికి ‘సత్యమేవ జయతే’ అనే క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. కవిత చివరిసారిగా మార్చి 14న ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. యాదాద్రి ఆలయం ఫొటో పేపర్‌ క్లిప్‌ను షేర్‌ చేస్తూ.. ‘దేవుడు శాసించాడు.. KCR నిర్మించాడు’ అని ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు.


Similar News