KTR: మీ అడుగుజాడల్లోనే రాష్ట్ర పోరాటం.. జయశంకర్ సార్ కు కేటీఆర్ ఘన నివాళులు
తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి మీరు చేసిన కృషి అనిర్వచనీయం అని, మీ అడుగుజాడల్లోనే తెలంగాణ రాష్ట్ర పోరాటం కొనసాగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి మీరు చేసిన కృషి అనిర్వచనీయం అని, మీ అడుగుజాడల్లోనే తెలంగాణ రాష్ట్ర పోరాటం కొనసాగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ట్విట్టర్ లో నివాళులు అర్పించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పుట్టుక మీది.. చావు మీది.. బ్రతుకంతా తెలంగాణది అని జయశంకర్ సార్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారబోసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.
అంతేగాక తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ చేసిన కృషి అనిర్వచనీయం అంటూ.. స్వరాష్ట్ర సాధనలో ఒక దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి అజరామరమైనదని, వారి స్ఫూర్తి మరిచిపోలేనిది అని కొనియాడారు. ఇక సార్ అడుగుజాడల్లోనే తెలంగాణ రాష్ట్ర పోరాటం కొనసాగిందని, తెలంగాణ ప్రగతి ప్రస్థానానికి అడుగులు పడ్డాయని చెబుతూ.. చివరగా జోహార్ జయశంకర్ సార్!, జై తెలంగాణ అని కేటీఆర్ నినదించారు. కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటానికి విద్యార్ధులను, నాయకులను ఏకం చేస్తూ.. ఉద్యమానికి ఊపిరులు ఊదుతూ.. రాష్ట్ర సాధనే జీవిత లక్ష్యంగా బ్రతికారు. చివరికి రాష్ట్ర సాధనకు ముందే 2011, జూన్ 21 న మరణించారు.