ఆ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ ఎన్నికలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ స్థాయి నేతల సమీక్ష నిర్వహించారు.

Update: 2024-01-27 10:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ స్థాయి నేతల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేసీలు కలిపిపోయాయని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేయబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగానే బీజేపీకి లబ్ధి చేకూర్చేలా సికింద్రాబాద్, ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టబోతోందని షాకింగ్ కామెంట్స్ చేశారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల కుట్రను పటాపంచలు చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. అత్యధిక లోక్‌సభ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటేనే సమర్ధంగా నిలదీయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఆ రెండు పార్టీలకు ప్రజలు సరైన విధంగా బుద్ధి చెప్పారని.. పార్లమెంట్ ఎన్నికల్లో అదే విధంగా బీఆర్ఎస్‌కు అండగా ఉండాలని కోరారు. లోక్‌‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి షాకిస్తేనే రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెబుతున్నారు.. కానీ, ఆ రెండు పార్టీలు ఒకటే అని అన్నారు.

ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే బలమైన ప్రాంతీయ నాయకులకు మాత్రమే సాధ్యమని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే అని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని ముందే గుర్తించి ఇండియా కూటమి నుంచి కొన్ని పార్టీలు బయటకు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని తెలిపారు. మోసం అనేది కాంగ్రెస్ నైజం అని అన్నారు.

Tags:    

Similar News