కొండా సురేఖపై కోర్టుకెక్కిన కేటీఆర్.. క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్
కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంగ్ కేటీఆర్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంగ్ కేటీఆర్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయంటూ నేడు (గురువారం) న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సదరు పిటిషన్‌పై న్యాయస్థానం కూడా వెంటనే విచారణ ప్రారంభించింది. కేటీఆర్ తరపున సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వరావు కోర్టులో వాదనలు వినిపించనున్నారు. కాగా.. ఇక కేసులో బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను కేటీఆర్ తన సాక్షులుగా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల కేటీఆర్‌పై కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ ఇటీవల కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నాగచైతన్య, సమంతల విడాకులకు కారణం కేటీఆరేనని, ఆయన వల్లే ఎంతోమంది హీరోయిన్లు ఇక్కడి నుంచి వెళ్లిపోయారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కటై కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పు బట్టింది. తీవ్ర వ్యతిరేకత రావడంతో మంత్రి సమంత విషయంలో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ తర్వాత ప్రకటించారు. అయితే కేటీఆర్‌పై మాత్రం ఆమె తన ఆరోపణలను వెనక్కి తీసుకోలేదు. దీంతో కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు.
కాగా.. ఇదే విషయంలో అక్కినేని నాగార్జున కూడా కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. తనకుటుంబం పరువు తీసేలా వ్యాఖ్యలు చేశారని, ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా తాను మాత్రం న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసు కూడా కోర్టులో నడుస్తోంది.