KTR: బీఆర్ఎస్ అంటే.. ‘భారత రైతు సమితి’.. రైతన్నలకు కేటీఆర్ బహిరంగ లేఖ
కొట్లాట మనకు కొత్తగాదు.. బీఆర్‌ఎస్ అంటే.. ‘భారత రైతు సమితి’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కొట్లాట మనకు కొత్తగాదు..(BRS) బీఆర్‌ఎస్ అంటే.. ‘భారత రైతు సమితి’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. ఆదివారం రైతన్నలకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. అన్నదాతాలారా.. రైతు భరోసా ఎగవేతల మోసాన్ని ఎదిరించాలని సూచించారు. ఆంక్షలు.. కోతలతో సగం మందికి ఎగనామం పెట్టే ఎత్తులను చిత్తుచేయాలన్నారు. ప్రతి ఎకరాకు.. ప్రతి రైతుకు పెట్టుబడి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాలని పిలుపునిచ్చారు.(TG Assembly) శాసనసభలో రైతు భరోసాపైనా ఏమీ చెప్పకుండా.. ఎటూ తేల్చకుండా సంబంధంలేని అంశాలపైకి చర్చను మళ్లించి అసలు సంగతిని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అతి తెలివితో పక్కదారి పట్టించాడని విమర్శించారు.
(Congress)కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వరుస చూస్తే.. కోతలు కొర్రీలు పెట్టి రైతు భరోసాను సగానికి సగం ఎగవేసే ఎత్తుగడతో ఉన్నట్టు అర్థమైందన్నారు. అన్నదాతలారా తస్మాత్ జాగ్రత్త! వంచనను గ్రహించి ఆంక్షలు వద్దని ఆందోళన చేయాల్సిన వేళ ఇదన్నారు. ఇప్పుడు మేల్కోకపోతే భరోసా ఉండదు.. గోస మాత్రమే మిగులుతుందని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ మార్గదర్శకాలనే రైతు భరోసా కూడా వర్తింపజేస్తామని చెబుతున్నదని, అదే జరిగితే రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా పెట్టుబడి పైసలు రావని హెచ్చరించారు. రైతు బంధు మీద కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం అంతా.. రైతు భరోసాకు కోతలు పెట్టే దురుద్దేశంతో చేస్తున్నదేనని ఆరోపించారు. రూ. 22 వేల కోట్లు రియల్ ఎస్టేట్ ప్లాట్లకు.. క్రషర్లుకు ఇచ్చారని దుష్టబుద్ధితో దుర్మార్గమైన ప్రచారం చేస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తున్నదని ఆరోపించారు.
చైతన్యవంతమైన తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ సర్కారు ఎత్తులను నక్కజిత్తులను తిప్పికొట్టాలని, గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులకు గల్లా పట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతుల ఆకాంక్ష ఏంటో.. అభిప్రాయం ఏంటో తెలిసేలా సెగ పుట్టించాలన్నారు. మౌనంగా వుంటే దగా పడతాం.. నోరు విప్పకుంటే అన్యాయమైపోతాము. మీతో కలిసి మేము నడుస్తాం.. మీ ఆందోళనకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వంచన చేయడానికి చూస్తున్న కాంగ్రెస్ గ్రామాల్లో దంచికొడదాం.. రైతుకు కేసీఆర్ సర్కారు ఇచ్చిన రక్షణ కవచాలను కాంగ్రెస్ కబళిస్తుంటే చూస్తూ ఊరుకోమని లేఖలో పేర్కొన్నారు.