కారుకొండ బుద్ధవనం అభివృద్ధికి కృషి

ఎంతో చరిత్ర కలిగి ఉన్న కారుకొండ బుద్ధవనం అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు.

Update: 2024-09-06 11:47 GMT

దిశ, కొత్తగూడెం రూరల్ : ఎంతో చరిత్ర కలిగి ఉన్న కారుకొండ బుద్ధవనం అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని కారుకొండ గుట్టలపై ఉన్న బుద్ధ వనంతో పాటు బౌద్ధ ధ్యాన మందిరాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ధ్యాన మందిరాల విశిష్టత, చరిత్రను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనేక దశాబ్దాల క్రితం బౌద్ధ మతస్తులు ఏర్పాటు చేసుకున్న ధ్యాన మందిరాలు, గుహలు ఎంతో ఆకర్షణగా ఉన్నాయని, వీటిని పరిరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు.

    కారుకొండ గుట్ట పరిసరాల చుట్టూ రక్షణ కల్పించి సోలార్ లైటింగ్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తెస్తామని పేర్కొన్నారు. ప్రాచీన కాలం నాటి ఆనవాళ్లను చెక్కుచెదరకుండా రక్షించడమే అందరి బాధ్యతని అన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు విరివిగా మొక్కలను నాటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి మండల పరిషత్ అధికారి లక్ష్మీనారాయణ, ఎంపీఓ శ్రీనివాసరావు, బుద్ధిష్టు సొసైటీ ఆఫ్ ఇండియా గౌరవ అధ్యక్షులు ఆంతోటి నాగేశ్వరరావు, అధ్యక్ష కార్యదర్శులు కొచ్చర్ల కమలా రాణి, మారపాక రమేష్, మాజీ సర్పంచ్ బలరాం నాయక్, సింగరేణి డీవైజీఎం బీభత్స, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News