దిశ, వైరా: రాజకీయం.. ఒకప్పుడు నీతి, నిజాయితీతో పాటు కట్టుబాట్లతో కొనసాగిన మహా ఉద్యమం.. ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసేవారు. ఎన్నికల సమయంలో ఒక పార్టీ వారు మరో పార్టీ వారి ఇంటి వైపు కూడా కన్నెత్తి చూసేందుకు శాసించేవారు కాదు. కానీ, నేటి రాజకీయం మొత్తం కలుషితమైంది. భూమి గుండ్రంగా తిరిగినట్లుగానే నేటి రాజకీయాలు డబ్బు చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా రాజకీయం కాసులు చుట్టే పరిభ్రమించే రోజులు వచ్చాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్‌ను వ్యతిరేకించడంతో ఖమ్మం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పొంగులేటి ఎపిసోడ్‌తో ఖమ్మం జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. పొంగులేటి బీఆర్ఎస్ పార్టీపై విమర్శల బాణాలు ఎక్కు పెట్టడంతో స్వయంగా సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఒకవైపు బీఆర్ఎస్ అధిష్టానం.. మరోవైపు పొంగులేటి పోటాపోటీ రాజకీయాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు వెరీ కాస్ట్లీ గా మారనున్నాయి. బీఆర్ఎస్, పొంగులేటి ఆర్థిక బలాల నిరూపణ ముందు కాంగ్రెస్ పార్టీ కుదేలు అవుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
సీఎం సభ ఖర్చు 100 కోట్ల పై మాటే
జనవరి 18వ తేదీన ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఖర్చు వంద కోట్లు పై మాటే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్‌ను వ్యతిరేకించడంతో సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించారు. ఈ సభ ద్వారా దేశ రాజకీయాలతో పాటు ప్రధానంగా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఆత్మధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సభకు వెచ్చించిన ఖర్చు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్వయంగా అన్ని తానై ఈ సభ ఏర్పాట్లు చూసుకున్నారు. సభకు వచ్చేందుకు ఒక్కొక్కరికి రూ.300 చొప్పున తాయిలాలు అందజేశారు. సభా వేదికతో వద్ద ఏర్పాట్లతో పాటు ఇతర అన్ని ఖర్చులు కలిపి 100 కోట్లు సింపుల్గా దాటి ఉంటుందని బీఆర్ఎస్ వర్గాల్లోనే చర్చ జరిగింది. ఒక్క పొంగులేటి ఎపిసోడ్ తోనే ఖమ్మంలో బీఆర్ఎస్ సభ నిర్వహించి ఇంత ఖర్చు చేయటాన్ని పరిశీలిస్తే ఖమ్మం పాలిటిక్స్ ఎంత కాస్ట్లీ గా మారాయో అర్థమవుతుంది. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో వేలాది మందితో సమ్మేళన సమావేశాలు జరుగుతున్నాయి. సమ్మేళనాలకు వచ్చే వారికి భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. సభా వేదిక ఏర్పాటుతోపాటు ఇతర ఖర్చులను పెట్టేందుకు కూడా పొంగులేటి వెనుకాడటం లేదు.
స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలపైన గురి
ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని స్థానిక ప్రజాప్రతినిధులు నేతలపైనే బీఆర్ఎస్ తో పాటు పొంగులేటి గురి పెట్టారు. ప్రధానంగా పట్టణాల్లో ఉన్న మున్సిపాలిటీ కౌన్సిలర్లు, గ్రామాల్లో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, ద్వితీయ శ్రేణి నాయకులను తమ వైపు ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో అధికంగా ఉన్న వారిలో చాలామంది పక్క చూపులు చూస్తున్నారు. వీరందరిపై పొంగులేటి వర్గం గురి పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పోటీ చేసిన అన్ని పక్షాల అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారు. ప్రస్తుతం ఆయనపై సర్పంచులు ఆ సింపతి పనిచేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో చాలామంది నాయకులు పొంగులేటి వర్గం వైపు వెళ్లేందుకు విముకత చూపుతున్నారు. అయితే ఈ విముఖత సాధారణ ఎన్నికలు ముగిసే అంతవరకు ఉంటుందా.. ఎన్నికల ముందు పొంగులేటికి సానుకూలతగా మారుతుందా.. తెలియని పరిస్థితి నెలకొంది.
ప్యాకేజీ రాజకీయాలు షురూ..
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సీఎం కేసీఆర్.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్యాకేజీ రాజకీయాలు షురూ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లాలోని స్థానిక ప్రజాప్రతినిధులు ద్వితీయ శ్రేణి నాయకులకు ప్యాకేజీలు ప్రకటించి తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. గ్రామాల్లోని ఎంపీటీసీలు, సర్పంచులు మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు తమ ఎన్నికల్లో గెలుపొందేందుకు ఆస్తులు తాకట్టు పెట్టి మరి అప్పులు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రాజకీయ పరిణామాలు వారి ఆర్థిక బాధలు తీర్చే విధంగా ఉన్నాయనే చెప్పాలి. చాలామంది స్థానిక ప్రజా ప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నాయకులు ఆర్థిక ప్రయోజనాల అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులకు దళిత బంధు యూనిట్లను కొన్ని నియోజకవర్గాల్లో కేటాయించగా.. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు పొంగులేటి కూడా అదును చూసి స్థానిక ప్రజాప్రతినిధులను, ద్వితీయ శ్రేణి నాయకులను తన వైపు తిప్పుకునేందుకు స్పష్టమైన ప్రణాళికలు రూపొందించారని సమాచారం. పొంగులేటి చేరే రాజకీయ పార్టీ పేరు ప్రకటించిన తర్వాత ప్యాకేజీ రాజకీయాలు ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ వైపు తో పాటు పొంగులేటి వైపు నుంచి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక ఖరీదైన ఎన్నికలు గా మారనున్నాయి.
Read more :