చిన్న పిల్లలతో పనులు చేయిస్తే కేసులు

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, చిన్న పిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు.

Update: 2025-01-02 11:50 GMT

దిశ, కొత్తగూడెం రూరల్ : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, చిన్న పిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ఈనెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించే ఆపరేషన్ స్మైల్-XI లో భాగంగా పోలీస్ అధికారులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్ ప్రొటెక్షన్, హెల్త్ తదితర అధికారులతో గురువారం ఎస్పీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం పాల్వంచ భద్రాచలం ఇల్లందు మణుగూరులో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.

    అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఆపరేషన్ స్మైల్ - Xl కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 18 సంవత్సరాలలోపు పిల్లలు కిరాణం, మెకానిక్ షాపులు, హోటళ్లు, ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం లేదా చైల్డ్ కేర్ హోమ్ కు పంపించడం జరుగుతుందన్నారు. చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా భిక్షాటన, వెట్టి చాకిరి చేయించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

    ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆపరేషన్ స్మైల్ పోలీస్ నోడల్ ఆఫీసర్, డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, డీసీఆర్బీ మల్లయ్య స్వామి గౌడ్, జిల్లా వైద్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, డిడబ్ల్యూఓ స్వర్ణలత లెనినా, సీడబ్ల్యూసీ సభ్యులు అంబేద్కర్, సాదిక్ పాషా, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ షర్ఫుద్దీన్, నాగరాజు, యేసుపాదం, శాస్త్రి, డీసీపీఓ హరి కుమారి, చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ సందీప్, ఏ హెచ్ టీయూ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, ఎస్సైలు రమాదేవి, రాకేష్, తిరుపతి, నాగభిక్షం, రామకృష్ణ, సూర్యం, డివిజన్ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, ఆపరేషన్ స్మైల్-XI టీంలు పాల్గొన్నారు.


Similar News