మోడీ చేసే మోసాలకు భారతరత్న ఇవ్వాలి

దేశంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని.. అభివృద్ధిలో దూసుకుపోతామని.. ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దేశ ప్రజలను మోసం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భారతరత్న అవార్డు ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కేఏ పాల్ విమర్శించారు.

Update: 2025-01-04 14:46 GMT

దిశ బ్యూరో, ఖమ్మం : దేశంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని.. అభివృద్ధిలో దూసుకుపోతామని.. ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దేశ ప్రజలను మోసం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భారతరత్న అవార్డు ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కేఏ పాల్ విమర్శించారు. శనివారం ఖమ్మంలోని కృష్ణ ఫంక్షన్ హాల్ లో పలువురు సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మేధావులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ... దేశ ప్రధానిగా మోడీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలం అయ్యారని, నిరుద్యోగం నానాటికి పెరిగిపోతుందని, రైతాంగ సమస్యలు పరిష్కరించలేక, అంబానీ, అదాని, బడా కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ ప్రజలను పట్టించుకోవటం మానేశారని దుయ్యబట్టారు.

    తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పుల మయంగా మారిందని, ఏడాదికి లక్షన్నర కోట్ల అప్పు చేస్తుందని, ప్రతినెలా పదివేల కోట్లుకు పైగా అప్పు చేస్తూ ప్రజల నెత్తిన భారం మోపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించేందుకు సీఎంతో సహా 10 మంది మంత్రులు వచ్చినా తాను ఒక్కడినే ఒకవైపు చర్చల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానని, అందుకు మీరు సిద్ధమా? అని ఆయన సవాల్ చేశారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ గెలుపొందిన గ్రామాలలో వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. 


Similar News