బేసిక్ ఫౌండేషన్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
మైనారిటీలు బేసిక్ ఫౌండేషన్ శిక్షణ కోసం జనవరి 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కె. సత్యనారాయణ సోమవారం తెలిపారు.
దిశ బ్యూరో,ఖమ్మం : మైనారిటీలు బేసిక్ ఫౌండేషన్ శిక్షణ కోసం జనవరి 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కె. సత్యనారాయణ సోమవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్, మైనారిటీల సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వ పోటీ పరీక్షలైన గ్రూప్ -1 ప్రిలిమ్స్, గ్రూప్-2, గ్రూప్ -3 , గ్రూప్ -4 పరీక్షలు, కేంద్ర ప్రభుత్వ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు, బ్యాంకింగ్ మొదలైన పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు ఖమ్మం జిల్లాలో 4 నెలల పాటు ఉచిత బేసిక్ ఫౌండేషన్ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.
డిగ్రీ పూర్తి చేసుకున్న అర్హత, ఆసక్తి కలిగిన మైనారిటీ అభ్యర్థులు (ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సికులు) తమ దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డ్, ఆదాయ, కుల ధృవీకరణ, డిగ్రీ మార్క్స్ మెమో, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు (2) జతచేసి జిల్లా కలెక్టరేట్ రెండవ అంతస్తు ఎస్-29 లోగల జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో జనవరి- 10వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఇతర వివరాలకు 9704003002 నెంబర్ కు సంప్రదించాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పేర్కొన్నారు.