ఇండియా టూరిజం మ్యాప్‌లో ఎర్రుపాలెం మండలానికి ప్రత్యేక స్థానం : డిప్యూటీ సీఎం భట్టి

ఇండియా టూరిజం మ్యాప్ లో ఎర్రుపాలెం మండలానికి ప్రత్యేక స్థానం

Update: 2025-01-07 13:25 GMT

దిశ, ఎర్రుపాలెం: ఇండియా టూరిజం మ్యాప్ లో ఎర్రుపాలెం మండలానికి ప్రత్యేక స్థానం కల్పించేలా పర్యాటకంగా మండలాన్ని అభివృద్ధికి పటిష్ట ప్రణాళికలు తయారు చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి ఎర్రుపాలెం మండలంలో పర్యటించి 28 కోట్ల రూపాయల ఆర్ అండ్ బి రోడ్లు, కోటి 48 లక్షల రూపాయల ఎన్ ఆర్ ఈ జీ ఎస్ సీసీ రోడ్ల నిర్మాణం,రూ.5 కోట్ల 83 లక్షలతో చేపట్టిన జమలాపురం అటవీ పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జమలాపురం లో ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుంచి జమలాపురం దేవాలయ పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రజలు ఆకాంక్షించారని, దీనిని దృష్టిలో ఉంచుకొని గతంలో జమలాపురం చెరువు ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేసుకున్నామని, చెరువు కట్ట మీద రోడ్డు వెడల్పు చేసుకుని, గుట్ట మధ్య నుంచి రేమిడిచర్ల వరకు రోడ్డు వేసుకున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే జమలాపురం చెరువు, పక్కన కాటేజ్ కోసం పర్యాటక శాఖచే ప్రణాళికలు తయారు చేశామని అన్నారు. అటవీ శాఖ పరిధిలో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశామని అన్నారు.

అడవులను ధ్వంసం చేయకుండా, దానిని ఆస్వాదిస్తూ బతికేందుకు అవసరమైన కాటేజి అభివృద్ధి చేస్తే టూరిజం పెరుగు తుందని, దీనివల్ల స్థానిక ప్రజలకు ఆదాయం మెరుగు అవుతుందని అన్నారు. టూరిజం అభివృద్ధి కావడం వల్ల ఇక్కడ వ్యాపారాలు బాగా జరుగుతాయని అన్నారు. 6 నెలల్లో అటవీ పార్క్ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అన్నారు. జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కూడా ఆస్కారం ఉంటుందని అన్నారు. జిల్లాలో మారుమూల మండలం ఎర్రుపాలెం అని, ఇక్కడ అధికంగా మనకు ప్రకృతి పరంగా అందమైన గుట్టలు అడవి ఉంది కాబట్టి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలని, దీనివల్ల ఉద్యోగాలు, సంపద వస్తాయని అన్నారు. మండలానికి వచ్చే పర్యాటకులు అతిధులతో సమానమని, వారిని గౌరవంగా చూసుకుంటే మన ప్రాంతం అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని, ఇక్కడికి వస్తే బాగా చూసుకుంటారు అనే పేరు రావాలని అన్నారు. మండలంలోని అడవి, చెరువులే మన ఆస్తి అని వీటిని మనం సంరక్షించుకోవాలని ఉప ముఖ్యమంత్రి అన్నారు.

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, డిజైన్ నుంచి తుది అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన వరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా, జమలాపురం ఆలయానికి వచ్చే భక్తులు ఆహ్లాదంగా గడిపేలా ఉపముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించారని అన్నారు. పార్క్ శంకుస్థాపన కార్యక్రమానికి చాలా రోజుల నుంచి అధికారులు పడిన శ్రమ ఫలితమని అన్నారు. ఖమ్మం నగరంలో వారానికి దాదాపు 5 వేల మంది ప్రజలు వెలుగుమట్ల అర్బన్ పార్క్ కు వచ్చి సరదాగా గడుపుతున్నారని అన్నారు. ప్రకృతిని కాపాడటం మన సంస్కృతిలో భాగమని, ప్రకృతితో కలిసి, మెలిసి అభివృద్ధి సాధించాలని అన్నారు.

చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమా నాయక్ మాట్లాడుతూ, అటవీని సంరక్షిస్తూ ఇక్కడ ఆహ్లాదకరమైన పరిస్థితులు ఏర్పాటు చేసేందుకు అర్బన్ పార్క్ కార్యాచరణ తయారు చేయడం జరిగిందని అన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ పార్క్ ఉండే విధంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, ఎఫ్ డివో మంజుల, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News