ప్రభుత్వ భూములకు కబ్జా చెర వీడేనా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో కబ్జాకు గురైన ప్రభుత్వ, చెరువు భూములను అధికారులు గాలికి వదిలేశారా..

Update: 2025-01-08 12:28 GMT

దిశ,పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో కబ్జాకు గురైన ప్రభుత్వ, చెరువు భూములను అధికారులు గాలికి వదిలేశారా... కార్పొరేషన్ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారా.. కార్పొరేషన్ అయితే అభివృద్ధి చెందుతుంది అని చెపుతున్నారు.. అభివృద్ధి చెందేది పట్టణాలా, రాజకీయ నాయకులా, కబ్జాకోరులా... అనే అనుమానం ప్రజల్లో నెలకొంది. నేటికీ 444 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో విచ్చలవిడిగా వెంచర్లు వేసి అమాయక గిరిజన ప్రజలను మోసం చేస్తున్నారు. ముందు పాల్వంచ పట్టణంలో ఉన్న ప్రభుత్వ చెరువు భూములను వెలికితీసి తర్వాత అభివృద్ధి కోసం మాట్లాడమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మండల వ్యాప్తంగా అనేక చెరువు భూములు, ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములను కొంత మంది బడా వ్యాపారస్తుల చేతులలో బంధీ అయ్యి ఉన్నాయి.

    వాటిని పరిరక్షించే బాధ్యత ఇక్కడ అధికారులకు లేదా అని నిలదీస్తున్నారు. గతంలో ఎన్నో చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జాకోరుల చేతుల్లోకి వెళ్లాయని అనేక పత్రికల్లో వార్తలు వచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి హైదరాబాద్ కేంద్రంగా హైడ్రా ను తీసుకు వచ్చి అక్రమ కట్టడాలను కూల్చి వేస్తూ ప్రజలకు భరోసా కల్పించించింది. అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని, చెరువు భూములను పరిరక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

    పాల్వంచ విషయానికి వస్తే ప్రభుత్వ భూమి ఉన్న సర్వే నెంబర్లు 444, 727, 817, 999, అదేవిధంగా రాతి చెరువు, చింతల చెరువు, మేడికుంట చెరువు ఇంకా మిగిలి ఉన్న చెరువులలోనే కాకుండా రిజర్వ్ ఫారెస్ట్ భూములు, శ్రీనివాస కాలనీ వైపు ఉన్న భూములను కూడా కబ్జా చేసి కొంతమంది బడా బాబులు పబ్బం గడుపుతున్నారు. ఆ భూముల్లో వెంచర్లు వేసి మరీ అమాయక ప్రజలకు విక్రయిస్తూ కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వం వీటన్నింటిపై దృష్టిసారించి విలువైన ప్రభుత్వ భూములను కాపాడటమే కాక అమాయక ప్రజలను వీరి బారి నుండి రక్షించాలని కోరుకుంటున్నారు.

చెరువు భూముల్లో సర్వే చేపట్టాలి

పాల్వంచలో ఉన్న దాదాపు అన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. చెరువుల పేర్లు మర్చిపోయి చాలా కాలం అయ్యింది అని, ఆ చెరువు భూముల్లో నిర్మాణాలు వెలిశాయని స్థానికులు అంటున్నారు. ఇంతలా కబ్జాలకు పాల్పడుతున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అవినీతి అధికారులు వారికి అండగా ఉన్నంత కాలం వారి ఆగడాలు ఆగవని ప్రజలు వాపోతున్నారు. కొంతమంది బడా బాబులు వారి కబ్జాలకు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న తీరు అంతా ఇంతా కాదు.

     ఏప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ మంత్రులను, కుటుంబ సభ్యులను ఇండ్లకు పిలిపించుకుంటున్న తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. రెవెన్యూ మంత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసి కావున పాల్వంచ పై ప్రత్యేక దృష్టి సారించి మొత్తం ప్రభుత్వ, చెరువు, ఫారెస్ట్ భూములను సర్వే చేపించి అక్రమంగా బై నెంబర్లతో పట్టాలు పొందిన వాటిని గుర్తించి వెలికితీస్తే వేలకోట్ల విలువైన భూములను పరిరక్షించవచ్చని సూచిస్తున్నారు. 


Similar News