అన్ని దారులు భద్రాద్రి వైపే...ప్రత్యేక ఆకర్షణగా ' ఏరు' రివర్ ఫెస్టివల్
భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో
దిశ,భద్రాచలం: భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో డిసెంబర్ 31 నుంచి ప్రారంభం అయిన వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా శ్రీ స్వామి వారు రోజుకు ఒక అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. బుధవారం రామయ్య కృష్ణావతారంలో భక్తులకు దర్శనం ఇవ్వగా... దశావతారాలలో చివరగా ఈ నెల17న కల్కి అవతారంలో రామయ్య భక్తులను అనుగ్రహిస్తారు. అధ్యయనోత్సవాలలో భాగంగా నేడు అనగా గురువారం సాయంత్రం 4 గంటలకు రామయ్యకు పవిత్ర గోదావరిలో ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై తెప్పోత్సవం జరగనుంది. 10వ తేదీ శుక్రవారం ఉదయం 5 గంటలకు గరుడ వాహనంపై స్వామి వారు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ వేడుకలు చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు ఇప్పటికే భద్రాద్రి చేరుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా దర్శనం, అదనపు ప్రసాదం కౌంటర్లు, అన్న ప్రసాదం విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తుల కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో అదనపు బస్సులు తిప్పుతున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా రివర్ ఫెస్టివల్..
భక్తులను ఆహ్లాద పరిచేందుకు ఈసారి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ చొరవతో గోదావరి ఒడ్డున రివర్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. దానికి 'ఏరు ' అని పేరు పెట్టారు. భక్తులు సేదతీరేందుకు హట్స్ ఏర్పాటు చేశారు. అలాగే గిరిజన ఉత్పత్తులు విక్రయించేందుకు స్టాల్స్, గిరిజన వంటలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అంతే కాకుండా గోదావరిలో బోటు షికార్ అవకాశం కల్పించారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్
వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా గురు, శుక్రవారంలో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం వీక్షించడానికి లక్ష మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పేర్కొన్నారు. ప్రతి సెక్టార్‌కు ముగ్గురు అధికారులను నియమించామని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉత్తర ద్వార దర్శనం అయిన తర్వాత మెయిన్ టెంపుల్లో స్వామి వారి దర్శనానికి భక్తులు వారి వారి సెక్టార్ల నుంచి క్యూ లో వెళ్లాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా భక్తులకు గిరిజన సంస్కృతి చూపించడానికి, ద్వీపం చూడాలంటే కిన్నెరసాని, ట్రైబల్ విలేజెస్ వీక్షించడానికి బొజ్జిగుప్ప, భద్రాచలంలో రివర్ ఫెస్టివల్ లో భాగంగా గోదావరి పక్కన విడిది, ఐటీడీఏ ప్రాంగణంలో ట్రైబల్ మ్యూజియం లో గిరిజన వస్తువులు, వారి జీవన విధానం తెలిసేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ట్రెక్కింగ్ కోసం కనకగిరి వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు. ఈసారి పర్యాటకం భక్తులను ఆకట్టుకుంటుందని అన్నారు.