పులకరించిన ‘భక్తాద్రి’

హంసవాహన రూపమైన నౌకలో మంగళ వాయుదాలు.. వేద పారాయణం మధ్య రామయ్య సూర్య ప్రభ వాహనంపై విహరించారు.

Update: 2025-01-09 14:26 GMT

దిశ, భద్రాచలం : హంసవాహన రూపమైన నౌకలో మంగళ వాయుదాలు.. వేద పారాయణం మధ్య రామయ్య సూర్య ప్రభ వాహనంపై విహరించారు. గోదావరి నదిలో ఐదు సార్లు విహరించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రామయ్య వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా దశావతారాలలో భక్తులకు దర్శనం ఇచ్చి సీతా లక్ష్మణ సమేతుడై నదీ విహారానికి రావడంతో గోదారమ్మ పులకించింది. భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా డిసెంబర్ 31 నుండి దశావతారాలలో భక్తులను అనుగ్రహించిన రామయ్యకు పవిత్ర గౌతమీ నదిలో హంస వాహనంలో సూర్య ప్రభ వాహనంపై వేంచేసి ఉండగా తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

     గురువారం ఉదయం నిత్య విధి అనంతరం పగల్ పత్తు సమాప్తి సూచకంగా పరకాల మునులు పరమ పదోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇప్పటి వరకు జరిపిన పరాయణాను ఈ ఉత్సవం ద్వారా పరిసమాప్తి చేశారు. సాయంత్రం 4 గంటలకు వేద మంత్రాలు, మేళతాళాలు మంగళ వాయుద్యాలు, భక్తుల కోలాటాలు జయ జయ ద్వానాల నడుమ స్వామి వారు గోదావరి తీరం వద్దకు బయలుదేరారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంలో సూర్య ప్రభ వాహనంపై వేంచేశారు. అనంతరం గోదావరిలో ఐదు సార్లు, ఐదు ప్రాంతాలలో విహరించారు. స్వామి వారు హంస వాహనంలో విహరించే సమయంలో కాల్చిన బాణాసంచా వెలుగులు దివిపై నుండి ముక్కోటి దేవతలు పూల వర్షం కురిపిస్తున్నట్లు భ్రమింపజేసింది.ఈ వేడుకను తిలకించిడానికి సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు భద్రాద్రి చేరుకోవడంతో భద్రాద్రి భక్తాద్రిగా మారింది. భద్రాచలం దివ్యక్షేత్రం భక్తుల శ్రీరామ నామస్మరణతో మారు మోగింది.

రేపు వైకుంఠ ద్వార దర్శనం

అధ్యయనోత్సవాలలో భాగంగా గురువారం స్వామి వారు నదీ విహారం చేయగా...ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై ఆశీనులై తెల్లవారు జాము 5 గంటలకు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వైకుంఠ ద్వారంలో రామయ్యను దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు భద్రాద్రి చేరుకున్నారు.

ఆకట్టుకున్న రివర్ ఫెస్టివల్ .

వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా ఈసారి భక్తులకు కనువిందు చేయడానికి గోదావరి తీరంలో అధికారులు రివర్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కుటీరాలు నిర్మించి గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబించేలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ద్వారా గిరిజన ఉత్పత్తులు విక్రయుంచడమే కాకుండా వారి వంటలను భక్తులకు రుచి చూపించారు. రివర్ ఫెస్టివల్ భక్తులను ఆకట్టుకుంది.


Similar News