నైపుణ్యత గల ఉపాధ్యాయులను తయారు చేయాలి

ఖమ్మం జిల్లాలోని డైట్ కళాశాల ద్వారా నైపుణ్యత గల ఉపాధ్యాయులను తయారు చేసి సమాజానికి అందించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

Update: 2025-01-09 14:21 GMT

దిశ, ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని డైట్ కళాశాల ద్వారా నైపుణ్యత గల ఉపాధ్యాయులను తయారు చేసి సమాజానికి అందించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గురువారం మంత్రి ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని ఏడవ డివిజన్ టేకులపల్లిలో పర్యటించి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి డైట్ అడ్మినిస్ట్రేటివ్ భవన ఆధునీకరణ, అదనపు సదుపాయాల ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..70 సంవత్సరాలలో అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో విద్యను అభివృద్ధి చేయలేక పోయామని అన్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా కీలకమైందని, దీనివల్ల అద్భుతమైన మార్పులు సాధ్యమవుతాయని మంత్రి తెలిపారు. జీవితంలో ఎదిగి ఒక స్థాయిలో ఉన్న ప్రతి వ్యక్తికి ఏదో ఒక దశలో ఒక ఉపాధ్యాయుడు మార్గం చూపే ఉంటారని అన్నారు.

    మనం ప్రస్తుతం మంత్రులుగా, ఉన్నతాధికారులుగా ఉండటానికి మన గురువులు మూలమని అన్నారు. ప్రస్తుత డైట్ కళాశాలల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప టీచర్లుగా తయారు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. నైపుణ్యత ఉన్న ఉపాధ్యాయుల కొరత ఉండటం వల్ల విద్యా ప్రాముఖ్యత, ప్రమాణాలు తగ్గుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో పిల్లలకు పూర్తి పరిజ్ఞానంతో సంపూర్ణ విద్య అందించేలా డైట్ కళాశాల నుంచి ఉపాధ్యాయులు బయటకు రావాలని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 11 వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేశామని, ప్రతి సంవత్సరం ఖాళీ అవుతున్న టీచర్ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తి చేస్తామని అన్నారు. డైట్ కళాశాల కాంపౌండ్ ను గ్రీనరీతో పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా తయారు చేయాలని అన్నారు.

    డైట్ కళాశాలలో ఎటువంటి మొక్కలు నాటాలో ప్రిన్సిపాల్, సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుని విద్యార్థుల సహకారంతో గ్రీనరీ పెంచాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ప్రజల శ్రేయస్సు కొరకు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. సత్యనారాయణ, డీఈఓ సోమశేఖరశర్మ, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ రవికుమార్, అధికారులు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News