ఆందోళన కలిగిస్తున్న అద్దె వాహన డ్రైవర్ల సీఎం పిఎఫ్ వివరాలు
సింగరేణి ఇల్లెందు ఏరియాలో అద్దె వాహన డ్రైవర్ల సీఎంపీఎఫ్ వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
దిశ, ఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియాలో అద్దె వాహన డ్రైవర్ల సీఎంపీఎఫ్ వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇల్లెందు ఏరియాలోని కోయగూడెం, జేకే ఉపరితల, జీఎం కార్యాలయంలో 118 మంది ఆద్దె వాహన డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఒక్కో అద్దె వాహనం డ్రైవర్ నుంచి ప్రతి నెల రూ. 3500 సీఎం పీఎఫ్ కటింగ్ పేరుతో వేతనం నుంచి కట్ చేస్తున్నారు. డ్రైవర్ నుంచి కట్ చేసిన 3500 తో పాటు యాజమాన్యం, లేదా గుత్తేదారు మరో రూ.3500 జత కలిపి డ్రైవర్ల పేరుతో ప్రతినెల సీఎం పీఎఫ్‌లో జమ చేయాలి. కానీ అలా జరగకుండా డ్రైవర్ నుంచి అదనంగా రూ.3500కట్ చేస్తూ మొత్తంగా రూ.7000 లను రికవరీ చేస్తున్నారు. ఇలా చేసిన మొత్తాన్ని కార్మికుడి అకౌంట్ పేరుతో సీఎం పీఎఫ్ కట్టాల్సి ఉంటుంది.
కానీ అందుకు భిన్నంగా ఇల్లెందు సింగరేణి ఏరియాలో అద్దె వాహన డ్రైవర్ల నుంచి వసూలు చేస్తున్న మొత్తం సొమ్మును ఎక్కడ జమ చేస్తున్నారో తెలియక వాహన డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం పీఎఫ్ రీజినల్ కార్యాలయంలో తమ పేర్లతో సీఎం పీఎఫ్ కట్టలేదని విషయాన్ని తెలుసుకుని బెంబేలెత్తిపోతున్నారు. 2022 జూన్ నుంచి ఇప్పటివరకు కార్మికుల పేరు మీద చెల్లిస్తున్న సీఎం పిఎఫ్ నిధి ఏమైందో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే టీయూసీ ఐ యూనియన్ ఆధ్వర్యంలో ఎండి యాకుబ్ షావలి నాయకత్వంలో పలువురు డ్రైవర్లు అధికారులను కలిసి విన్నవించారు.
ఇలా వెలుగులోకి..
సింగరేణి ఇల్లెందు ఏరియాలో అద్దె వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఇటీవల కాలంలో మరణించాడు. డ్రైవర్‌గా మొత్తం తొమ్మిది నెలలు విధులు నిర్వహించినప్పటికీ అతనికి రావాల్సిన మొత్తం కంటే తక్కువ అందించేందుకు సిద్ధమయ్యారు. అప్పుడు తోటి డ్రైవర్లు ఆందోళనకు గురై యూనియన్ నాయకుల దృష్టికి తీసుకెళ్లగా.. 2022నుంచి అద్దె వాహన డ్రైవర్లు చెల్లిస్తున్న మొత్తం సీఎం పీఎఫ్‌లో నమోదు కాకపోవడం వెలుగు చూసింది. ఇలా ఏరియాలో సింగరేణి నమ్ముకుని ఎంతోమంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తూ.. సీఎం పీఎఫ్ కట్టినప్పటికీ ఆచరణలో మాత్రం అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజుల్లో లెక్కలు చెబుతామంటున్న అధికారులు.. ఇటువంటి చిక్కుముడులు ఎలా విప్పుతారో వేచి చూడాల్సిందే.
సీఎంపీఫ్ లెక్కలను త్వరలోనే పరిష్కరిస్తాం
ఇల్లెందు ఏరియాలోని అద్దె వాహన డ్రైవర్ల సీఎం పీఎఫ్ లెక్కలను త్వరలోనే వెల్లడిస్తాం. కార్మికుల సొమ్ము భద్రం గా ఉంది. డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు:-జీవి మోహన్ రావు, డీజీఎం పర్సనల్