శ్రీకృష్ణావతారంలో పర్ణశాల రామయ్య
పర్ణశాలలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
దిశ,దుమ్ముగూడెం : పర్ణశాలలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దశావతారాల్లో భాగంగా స్వామివారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముక్కోటి ఏకాదశి అధ్యాయనోత్సవాలలో భాగంగా తొమ్మిదో రోజు స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మొదటగా సుప్రభాతం సేవలు పలికిన అర్చకులు ఆరాధనాధి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణ అవతారంలో స్వామివారిని ముస్తాబు చేసి ఆలయ ఆవరణలో ఆసీనులు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ కృష్ణావతారంలో స్వామివారి ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. అనంతరం మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు కోలాటాల నడుమ తిరువీధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆలయ ఇంచార్జి అనిల్ కుమార్, ముఖ్య అర్చకులు శేషం కిరణ్ కుమారాచార్యులు, భార్గవాచార్యులు, వేదపండితులు నరసింహాచార్యులు, నలదీగల నరసింహాచార్యులు, వెంకటాచార్యులు, భారద్వాజచార్యులు, శివ, రాము తదితర సిబ్బంది పాల్గొన్నారు.