కార్పొరేషన్ తో ఎవరికీ నష్టం లేదు : ఎమ్మెల్యే కూనంనేని
కొత్తగూడెం పాల్వంచ సుజాతనగర్ కలిపి కార్పొరేషన్ కావడం
దిశ,కొత్తగూడెం రూరల్: కొత్తగూడెం పాల్వంచ సుజాతనగర్ కలిపి కార్పొరేషన్ కావడం వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగదని స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. మంగళవారం ఇల్లందు క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న ప్రభుత్వ హరిత హోటల్ లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
కొత్తగూడెం, పాల్వంచ రెండు జంట పట్టణాలతో పాటు సుజాతనగర్ మండలంలోని 7 గ్రామ పంచాయతీలతో నూతన కార్పొరేషన్ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధిక నిధులు వస్తాయని అభివృద్ధి విస్తృతంగా ఉంటుందని తెలిపారు. కార్పొరేషన్ లో ఆస్తుల విలువ పెరుగుతాయని తెలిపారు. టాక్స్ లు పెరుగుతాయని కొద్ది మంది అపోహ పడుతున్నారని భారీ మొత్తంలో టాక్స్ లు ఉండవన్నారు. విద్యార్థులకు వీసా, పాస్ పోర్ట్ పొందుటకు సులువుగా ఉంటుందన్నారు.
జిల్లాలో బొగ్గు విద్యుత్ ఖనిజాలు ఉన్నాయి కాబట్టి ఆధారిత అభివృద్ధికి పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశం ఉంటుందని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు అవుతుందన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుతో గిరిజనుల రిజర్వేషన్లు కోల్పోతారని అపోహలు వద్దని పరిపాలనకు రిజర్వేషన్లకు సంబంధం లేదని ఇందుకు ఉదాహరణ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ గిరిజన రాష్ట్రాలని గిరిజన ప్రాంతం గిరిజన చట్టాలు అమలులో ఉన్న రాష్ట్రాలైనప్పటికీ కార్పొరేషన్ విధానం అమలులో ఉందని వివరించారు. పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు గత 29 ఏళ్లుగా జరగడం లేదని కార్పొరేషన్ ఏర్పాటు పాల్వంచకు వరప్రదాయిని ప్రజలకు విముక్తి కలుగుతుందని తెలిపారు. రిజర్వేషన్లు గిరిజన చట్టాలకు ఎటువంటి నష్టం ఉండదని పరిపాలనకు రిజర్వేషన్లకు సంబంధం లేదన్నారు.
ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం డిస్టెన్స్ లిమిటేషన్ నిబంధన లేదు కాబట్టి కొత్తగూడెం ఎయిర్పోర్ట్ ఏర్పాటు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, రెండు నూతన ఆర్టీసీ బస్టాండ్ ల నూతన నిర్మాణం కొరకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఎంఆర్ఓ ఎంపీడీవో కార్యాలయాలకు నూతన భవనాలు ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు నూతన బొగ్గు బావుల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు స్పోర్ట్స్ అభివృద్ధి ఇండోర్ స్టేడియం ఐటీ హబ్ జూలాజికల్ పార్క్ ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోనే మన జిల్లా రెండవ పారిశ్రామిక జిల్లాగా ఉందని తెలిపారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఉందని కొత్తగూడెం అభివృద్ధి జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభివృద్ధికి ముఖ్యమంత్రిని సానుకూల దృక్పథంతో సహకరించాలని కోరారు. విలేకరుల సమావేశంలో పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.