24 గంటల్లో ముక్కోటి పనులు పూర్తి చేయాలి

ముక్కోటి ఏకాదశి పనులు 24 గంటలలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

Update: 2025-01-06 14:25 GMT

దిశ, భద్రాచలం : ముక్కోటి ఏకాదశి పనులు 24 గంటలలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని చాంబర్లో ముక్కోటి ఏర్పాట్లపై జరుగుతున్న పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీవీఐపీలకు, వీఐపీలకు వేరువేరుగా భారీ కేడ్లతోపాటు వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని, భక్తులు ఇబ్బందులు పడకుండా శానిటేషన్ పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

    భక్తులు పడవేసే వ్యర్థ పదార్థాలు ఎక్కడపడితే అక్కడ వేయకుండా డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలని, గ్రామపంచాయతీ సిబ్బంది భద్రాచలం పట్టణం మొత్తం శుభ్రంగా ఉండేలా చూడాలని, ఘాట్​లో, సారపాక నుండి భద్రాచలం పార్కింగ్ ప్రదేశాల వరకు విద్యుత్ కాంతులతో వెదజల్లాలని, దేవస్థానంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు తొక్కిసలాట జరగకుండా పోలీసులు, దేవస్థానం సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా చూడాలని కోరారు. మంచినీటి సౌకర్యం కొరకు 20 ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని, నాలుగు వాటర్ ట్యాంకర్లు ఎప్పటికప్పుడు గస్తీ తిరుగుతూ ఉండాలని, ప్రస్తుతం నిర్మిస్తున్న 138 టాయిలెట్లతోపాటు మొబైల్ టాయిలెట్లు అదనంగా తెప్పించాలని, 8, 9,10, తేదీలలో మెయిన్ ఫెస్టివల్ గా పరిగణిస్తున్నందున ఏడో తేదీ నాటికి అన్ని పనులు పూర్తి కావాలని ఆయన అధికారులకు ఆదేశించారు.

    ముఖ్యంగా భక్తులు అస్వస్థతకు గురి అయితే వెంటనే వైద్య చికిత్సలు అందేలా ప్రత్యేక వైద్య కేంద్రాలతో పాటు అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. 9, 10 తేదీలలో మద్యం మాంసం దుకాణాలు పూర్తిగా బంద్ చేయించాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రోడ్లకు బస్సు సౌకర్యం కల్పించాలని అన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రివర్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహిస్తున్నందున దానిలో భాగంగా ఐటీడీఏ ద్వారా ఏర్పాట్లు చేసే కల్చరల్ ప్రోగ్రామ్స్ తెప్పోత్సవానికి ముందు ఆ తర్వాత నిర్వహించేలా చూడాలని, దాంతోపాటు ట్రైబల్ కల్చర్ కు సంబంధించిన కళాఖండాలు, గిరిజన వంటకాలు, కరక్కాయ పొడితో టీ తయారు చేయడం, ఔషధ గుణాలకు సంబంధించిన ఆహార పదార్థాల అమ్మకాల కొరకు ఏర్పాటు చేసిన స్టాల్స్ పర్యాటకులు సందర్శించి కొనుగోలు చేసేలా చూడాలని, దీని ద్వారా గిరిజనులకు ఉపాధి దొరికే అవకాశం ఉందని అన్నారు.

    భక్తుల కొరకు ఏర్పాట్లు చేస్తున్న తాత్కాలిక విడిది, గృహాలలో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, వచ్చే భక్తులు ఈ గృహాలలో బస చేసి కిన్నెరసాని, బొజ్జిగుప్ప, బెండలపాడు, ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియం సందర్శించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. అనంతరం ఉత్తర ద్వార దర్శనం జరుగు ప్రదేశాలు, మిథిలా స్టేడియంలోని స్వామివారి పూజా కార్యక్రమాలు, తెప్పోత్సవం జరుగు ప్రదేశాలు, పార్కింగ్ ప్రదేశాలు, తాత్కాలిక విడిది గృహాలు, సెల్ఫీ పాయింట్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజ్, డీ ఆర్ డీఓ విద్యాచందన, దేవస్థానం ఈఓ రమాదేవి, ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ వెంకటేశ్వర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


Similar News