అంతా మా ఇష్టం.. అధికారుల పర్మిషన్ తో మాకేంటి ?

రాష్ట్రంలో 33 శాతం మొక్కలను నాటి ప్రతి పల్లెను పచ్చదనంతో నింపాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం హరితర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి ఏటా కోట్లాది రూపాయలు వెచ్చించి మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు.

Update: 2025-01-06 15:40 GMT

దిశ, కూసుమంచి : రాష్ట్రంలో 33 శాతం మొక్కలను నాటి ప్రతి పల్లెను పచ్చదనంతో నింపాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం హరితర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి ఏటా కోట్లాది రూపాయలు వెచ్చించి మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. కానీ కొంతమంది వ్యక్తులు తమ ప్రైవేటు వ్యాపార భవన సముదాయానికి అడ్డుగా ఉన్నాయని ఏపుగా పెరిగిన హరితహారం చెట్లను అంతా మా ఇష్టం అధికారుల పర్మిషన్ తో మాకేంటి అనుకున్నారేమో? చెట్లను నరికి నేలమట్టం చేశారు. వివరాల్లోకి వెళితే కూసుమంచి మండల కేంద్రంలోని ఖమ్మం, సూర్యాపేట రహదారి వెంబడి లేక్ పార్క్ సమీపంలో ఇటీవల నూతనంగా ఓ ప్రైవేట్ షోరూమ్ ను నిర్మించారు. తమ షోరూమ్ బోర్డు కనిపించకుండా అడ్డు వస్తున్నాయని రహదారి వెంట పెరిగిన వృక్షాలను తమ ఇష్టానుసారంగా నరికివేశారు.

     తమ షోరూమ్ కు అవి అడ్డుగా ఉన్నాయనే కారణంతో అనుమతులు తీసుకోకుండా చెట్లను నరికి వేశారు. గతంలో నాటిన మొక్కలు నేడు పెరిగి వృక్షాలయ్యాయి. అయితే ఆ చెట్లు భారీ ఎత్తుగా పెరగడంతో షోరూం కు చెందిన సిబ్బంది వాటిని అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో ఎటువంటి పర్మిషన్ లేకుండా సుమారుగా 20 చెట్లకు పైగా వృక్షాలను నరికి వేశారు. రహదారుల వెంట పచ్చదనం పెంపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం హరితహార కార్యక్రమాలను చేపట్టి మొక్కల పెంపకం వాటి ప్రాముఖ్యతను పెంపొందిస్తుంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల పెరిగిన చెట్లను అక్రమార్కుల గొడ్డలికి బలి అవుతున్నాయి. చెట్లను సంరక్షించాల్సిన అధికారుల పర్యవేక్షణ కరువవడంతోనే కొంతమంది వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ ఏథేచ్ఛగా చెట్లను నరికి వేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకొని చెట్లను సంరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

కూసుమంచి ఎంపీడీఓ, స్థానిక పంచాయతీ కార్యదర్శి ఏమన్నారంటే...

కూసుమంచి ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి, స్థానిక పంచాయతీ కార్యదర్శి నీరజలను హరితహారం చెట్ల నరికివేత పై వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. చెట్లు నరికి వేయడానికి ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. చెట్లు నరికి వేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 


Similar News