జీసీసీ హమాలీ కార్మికుల మెరుపు సమ్మె..
అక్టోబర్ 2024 లో జరిగిన జీసీసీ సివిల్ సప్లై రేట్ల ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జీసీసీ హమాలీ వర్కర్స్ మెరుపు సమ్మెకు దిగారు.
దిశ, భద్రాచలం : అక్టోబర్ 2024 లో జరిగిన జీసీసీ సివిల్ సప్లై రేట్ల ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జీసీసీ హమాలీ వర్కర్స్ మెరుపు సమ్మెకు దిగారు. సమ్మెను సీఐటీయూ పట్టణ ఇంచార్జ్ నాయకులు గడ్డం స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐటీయూ పట్టణ నాయకులు నకిరికంటి నాగరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై, జీసీసీ హమాలీ కార్మికుల ఎగుమతి, దిగుమతి రేట్ల విషయమై గత మూడు నెలల క్రితం 2024 అక్టోబర్ 3 న అన్ని కార్మిక సంఘాల సమక్షంలో సివిల్ సప్లై కమిషనర్, అధికారులు చర్చలు జరిపారన్నారు. పాత రేట్ల కంటే అదనంగా మూడు రూపాయలు దిగుమతి, ఎగుమతి రేట్లు పెంచారన్నారు. పెంచిన రేట్లను అమలు చేస్తామని ఏరియర్స్ తో కలిపి చెల్లిస్తామని సివిల్ సప్లై అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు.
కానీ నేటికి ఒప్పందం అమలు కాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మె చేయవలసిన పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. ఒప్పందం జరిగి మూడు నెలలు కావస్తున్నా నేటికీ పెరిగిన రేట్లకు సంబంధించిన జీవోను అధికారులు విడుదల చేయకపోవడం దారుణమని అన్నారు. గతంలో అనేక సందర్భాల్లో ఒప్పందాలు జరిగిన వెంటనే జీవో విడుదల చేసే వారని, కానీ ఒప్పందం జరిగి మూడు నెలలు గడుస్తున్నా జీవో విడుదల చేయకపోవడం సరైనది కాదని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం హమాలీల రేట్ల పెంపు జీవోను విడుదల చేసి 2024 జనవరి నుండి ఏరియర్స్ కు బడ్జెట్ కేటాయించాలని, ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ నాయకులు ఎస్ అజయ్ కుమార్, ఆర్ రాములు, పాల్గొనగా గురువారం సమ్మెలో జీసీసీ హమాలీలు సుబ్రహ్మణ్యం, ప్రసాదు, శేషు, లోకేష్, రామారావు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.