పదవులు వచ్చేస్తున్నాయి..!
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త సంవత్సరంలో తీపి కబురు వినిపించే అవకాశాలు ఉన్నాయి.
దిశ, ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త సంవత్సరంలో తీపి కబురు వినిపించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో మార్కెట్ కమిటీ, ఆత్మ డివిజన్ కమిటీలు, ఇతర పదవులు ఖరారు చేసిన ఖమ్మం జిల్లాలో మాత్రం కొద్దిగా ఆలస్యమైనా పదవుల లిస్ట్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. రెండు మూడు రోజుల్లో లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల నుంచి విపరీతంగా లీకులు వస్తున్నాయి. పదవుల కోసం ఎదురుచూస్తున్న నాయకుల్లో టెన్షన్ మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ వ్యవసాయ మార్కెట్ తర్వాత ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రెండో స్థానంలో ఉంది. ఈ మార్కెట్ కమిటీకి బీసీ వర్గానికి చెందిన వాళ్లకి ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు.
ఖమ్మం నియోజకవర్గంలోని వెంకటాయపాలెం చెందిన బీసీ వర్గానికి చెందిన యరగర్ల హనుమంతరావు ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యరగర్ల హనుమంతరావు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు విధేయుడుగా ముద్ర పడింది. దాంతో పాటు వైస్ చైర్మన్ గా తల్లాడ రమేష్ పేరు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఆత్మ డివిజన్ కమిటీ చైర్మన్ గా బూడిదం పాడు గ్రామానికి చెందిన దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు పేరును ఖరారు చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు ఎస్టీ వర్గానికి చెందిన దీప్లా నాయక్ కు ఖమ్మం నగరంలో కీలక పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండో సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో కీలకమైన పదవులు లిస్ట్ విడుదల చేసేందుకు మంత్రులు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. వారి వారి అనుచరులకు పదవులు ఇప్పించేందుకు ముగ్గురు మంత్రులు ఏకాభిప్రాయం వచ్చిన్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారి వారి అనుచరులకు కీలకమైన పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాబోయే రోజుల్లో సూడా చైర్మన్, గ్రంథాలయం, డీసీసీ అధ్యక్షుడు పదవులను లిస్టు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ లోపు కీలకమైన పదవులు లిస్టు విడుదల అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలను తెలుస్తుంది. ఇప్పటికే పదవుల కోసం పైరవీలు చేస్తున్న నాయకులు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎవరికి వారు నాకంటే నాకు పదవులు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో కీలక పదవుల లిస్టులలో ఎవరి పేరు వస్తుందో వేచి చూడాల్సిందే.