జమిలి కాదు మోదీ.. ముందు మహిళా కోటా లెక్క తేల్చు...
జమిలి ఎన్నికల పేరుతో మరో కొత్త నాటకానికి తెరలేపిన మోదీ ముందు చట్టసభలలో మహిళల 33 శాతం రిజర్వేషన్ కోటా లెక్క తేల్చాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు.
దిశ, భద్రాచలం : జమిలి ఎన్నికల పేరుతో మరో కొత్త నాటకానికి తెరలేపిన మోదీ ముందు చట్టసభలలో మహిళల 33 శాతం రిజర్వేషన్ కోటా లెక్క తేల్చాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. పట్టణంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ ఆవరణలో ప్రారంభమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐద్వా మహాసభలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లు లక్ష్మి మాట్లాడారు. మోదీ మూడోసారి అధికారం చేపట్టాక భారత రాజ్యాంగం అత్యంత ప్రమాదంలో పడిందని ఆరోపించారు. ఆకాశానికి అంటుతున్న నిత్యావసర ధరల ప్రభావంతో మహిళలకు, శిశువులకు పోషక ఆహారం అందకుండా పోతుందని, ఆ ప్రభావం గడిచిన పదేళ్లలో ఎంతోమంది మహిళలు, శిశువులు పౌష్టికాహార లోపంతోనే మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో ఉన్న మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టలేని చేతకాని మోదీ రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని ప్రగల్బాలు పలకడం హాస్యాస్పదమని ఆమె అన్నారు. ఉద్యమాల గడ్డయిన భద్రాచలం పట్టణంలో నిర్వహిస్తున్న జిల్లా మూడో మహాసభలో భవిష్యత్ కర్తవ్యాలు నిర్ణయించుకొని రానున్న రోజుల్లో మహిళలు స్వేచ్ఛగా చైతన్యవంతంగా నిలిచేందుకు కావాల్సిన పోరాటాలను రూపొందించుకుంటామని ఆమె స్పష్టం చేశారు. మహిళలకు పురుషులతో సమానంగా విద్య, ఉపాధి అవకాశాలతో పాటు సమాన పనికి సమాన వేతనం కోసం పలు తీర్మానాలను ఈ మహాసభలో చర్చించనున్నట్టు తెలిపారు. ఈ మహాసభ భవిష్యత్ మహిళా ఉద్యమానికి దిక్సూచి అని పేర్కొన్నారు.